భారత్- పాక్ మ్యాచ్‌పై శ్రీలంక ప్రత్యేక దృష్టి!
ఈ వరల్డ్ కప్‌ను శ్రీలంక తన అంతర్జాతీయ వేదికలను అప్‌గ్రేడ్ చేయడానికి ఒక అవకాశంగా తీసుకుంది. కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ (SSC) స్టేడియంలో కొత్త ఫ్లడ్ లైట్లను అమర్చారు.
- Author : Gopichand
Date : 29-01-2026 - 8:34 IST
Published By : Hashtagu Telugu Desk
IND vs PAK Match: భారత్- పాకిస్తాన్ జట్ల మధ్య టీ20 వరల్డ్ కప్ 2026 మహా సమరం ఫిబ్రవరి 15న కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరగనుంది. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ కోసం శ్రీలంక ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ గ్లోబల్ టోర్నమెంట్‌లో జట్లకు రక్షణ కల్పించడానికి శ్రీలంక తన ఎలైట్ ఆర్మ్డ్ యూనిట్లను రంగంలోకి దించుతోందని ఆ దేశ అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా ఇండో-పాక్ మ్యాచ్ దృష్ట్యా భద్రతను అత్యంత కఠినతరం చేస్తున్నారు.
శ్రీలంక సహాతిథ్య దేశం
ఈ టీ20 ప్రపంచకప్‌ను భారత్‌తో కలిసి శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 7 నుండి మార్చి 8 వరకు ఈ టోర్నీ జరగనుంది. గ్రూప్-ఏ లో భాగంగా భారత్- పాకిస్తాన్ జట్లు కనీసం ఒకసారి ఫిబ్రవరి 15న కొలంబోలో తలపడనున్నాయి.
భారత్-పాక్ మ్యాచ్‌పై ప్రత్యేక దృష్టి
శ్రీలంక క్రీడా మంత్రి సునీల్ కుమార గామగే బుధవారం అర్థరాత్రి ఏఎఫ్‌పీతో మాట్లాడుతూ.. టోర్నమెంట్‌ను సజావుగా నిర్వహించడానికి తాము అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని, ముఖ్యంగా భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. సాధారణంగా దేశాధినేతల పర్యటనల సమయంలో భద్రత కల్పించే ఎలైట్ కమాండో యూనిట్లను క్రికెట్ జట్ల రక్షణ కోసం కేటాయిస్తున్నట్లు పోలీస్, భద్రతా అధికారులు వెల్లడించారు.
Also Read: ఇప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుందో తెలుసా?
సాయుధ బలగాల పహారా
ఒక అధికారి పేరు వెల్లడించడానికి ఇష్టపడకుండా మాట్లాడుతూ.. జట్లు విమానాశ్రయం నుండి బయటకు వచ్చిన క్షణం నుండి, తిరిగి వెళ్లే వరకు వారికి సాయుధ దళాల రక్షణ ఉంటుంది అని తెలిపారు. రాజకీయ విభేదాల కారణంగా భారత్‌లో మ్యాచ్‌లు ఆడటానికి పాకిస్తాన్ నిరాకరించడంతో ఐసీసీ (ICC) వారి మ్యాచ్‌లను తటస్థ వేదిక అయిన శ్రీలంకకు మార్చింది.
బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్
భద్రతా కారణాల దృష్ట్యా బంగ్లాదేశ్ కూడా తమ మ్యాచ్‌లను భారత్ వెలుపల నిర్వహించాలని కోరింది. అయితే ఐసీసీ ఈ అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో అసంతృప్తి చెందిన బంగ్లాదేశ్ టోర్నమెంట్ నుండి తప్పుకోగా.. వారి స్థానంలో స్కాట్లాండ్‌ను చేర్చారు.
శ్రీలంక తటస్థ వైఖరి
శ్రీలంక క్రికెట్ కార్యదర్శి బందుల దిసానాయకే మాట్లాడుతూ.. ప్రాంతీయ వివాదాల్లో జోక్యం చేసుకోవడం తమకు ఇష్టం లేదని స్పష్టం చేశారు. “భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వివాదాల్లో మేము తటస్థంగా ఉంటాము. అవన్నీ మా మిత్రదేశాలే” అని ఆయన అన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి టోర్నీలకు ఆతిథ్యం ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
స్టేడియాల ఆధునీకరణ
ఈ వరల్డ్ కప్‌ను శ్రీలంక తన అంతర్జాతీయ వేదికలను అప్‌గ్రేడ్ చేయడానికి ఒక అవకాశంగా తీసుకుంది. కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ (SSC) స్టేడియంలో కొత్త ఫ్లడ్ లైట్లను అమర్చారు. ఈ గ్లోబల్ టోర్నీని విజయవంతంగా నిర్వహించడం ద్వారా తమ సత్తా చాటాలని శ్రీలంక ప్రయత్నిస్తోంది.