IND VS SA : గాయంతో రెండో టెస్టుకు దూరమైన శుభ్‌మన్ గిల్.. భారత్‌కు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్న రిషబ్ పంత్!
- By Vamsi Chowdary Korata Published Date - 01:46 PM, Fri - 21 November 25
దక్షిణాఫ్రికా తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రెండో టెస్టుకు దూరమయ్యాడు. కోల్‌కతాలో జరిగిన తొలి టెస్టు రెండో రోజు గిల్‌కి మెడలో తీవ్ర నొప్పి (neck spasm) వచ్చింది. ఆ మ్యాచ్ తర్వాత ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యం మెరుగుపడిందో లేదో తెలుసుకోవడానికి గిల్ ఈ వారం గువాహటికి వెళ్లినా, పూర్తిగా కోలుకోలేకపోవడంతో బీసీసీఐ ఆయనను జట్టులో నుండి రిలీజ్ చేసింది. ఇప్పుడు ఆయన మరింత చికిత్స మరియు విశ్రాంతి కోసం ముంబైకి వెళ్లారు.
గిల్ ఆడలేనందున రెండో టెస్టులో ఋషభ్ పంత్ భారత జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో నిలవాలంటే భారత్ ఈ టెస్టును తప్పక గెలవాలి. బీసీసీఐ ప్రకారం, కోల్‌కతా టెస్టులో గాయమైన తర్వాత గిల్ ని నిరంతరం పరిశీలనలో ఉంచినా, ఆయన శరీరం రెండో టెస్టుకు పూర్తిగా సిద్ధం కాలేదు.
ప్రీ-మ్యాచ్ మీడియా సమావేశంలో పంత్ తెలిపిన ప్రకారం, గిల్ ఆడాలని బలంగా కోరుకున్నప్పటికీ ఆయన శరీరం అనుమతించలేదని చెప్పారు. జట్టులో ఆయన స్థానంలో ఎవరిని తీసుకోవాలనే విషయంపై జట్టు దాదాపు నిర్ణయం తీసుకుందని పంత్ వెల్లడించాడు.
తొలి టెస్టులో గిల్ మూడు బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. సైమన్ హార్మర్ బౌలింగ్‌లో స్వీప్ ఆడే ప్రయత్నంలో ఆయన మెడ పట్టుకుని నొప్పితో క్షణాల్లో మైదానం వీడాడు. రెండో ఇన్నింగ్స్‌లో కూడా ఆయన బ్యాటింగ్‌కు రాలేదు. 124 రన్స్ లక్ష్యాన్ని చేదించలేక భారత్ ఆ మ్యాచ్‌ను 30 పరుగుల తేడాతో కోల్పోయింది.
రెండో టెస్టుకు నితీష్ కుమార్ రెడ్డి జట్టులో చేరాడు. గిల్ గైర్హాజరీతో నాలుగో స్థానంలో ధ్రువ్ జురెల్‌కు అవకాశం దక్కే అవకాశం ఉంది. గత కొన్ని నెలలుగా గిల్ నిరంతరం అంతర్జాతీయ క్రికెట్ ఆడుతూ ఉండటంతో ఆయనపై వర్క్‌లోడ్ భారీగా పెరిగింది.
ఈ నెల 30 నుంచి రాంచీలో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు గిల్ అందుబాటులో ఉంటాడా అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.