రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేసిన సర్ఫరాజ్ ఖాన్!
ముంబై తరపున లిస్ట్-A క్రికెట్‌లో ఇప్పటివరకు అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉండేది. రోహిత్ ఇదే సీజన్‌లో సిక్కింపై 62 బంతుల్లో సెంచరీ సాధించాడు.
- Author : Gopichand
Date : 31-12-2025 - 5:15 IST
Published By : Hashtagu Telugu Desk
Sarfaraz Khan: విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్‌లో భాగంగా డిసెంబర్ 31న జైపూర్ వేదికగా ముంబై, గోవా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్‌తో చరిత్ర సృష్టించాడు. గోవా బౌలర్లపై విరుచుకుపడిన సర్ఫరాజ్ ముంబై తరపున లిస్ట్-A క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేసి, టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టాడు.
ఈ చారిత్రాత్మక ఇన్నింగ్స్ విశేషాలు
రోహిత్ శర్మ రికార్డు కనుమరుగు
ముంబై తరపున లిస్ట్-A క్రికెట్‌లో ఇప్పటివరకు అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉండేది. రోహిత్ ఇదే సీజన్‌లో సిక్కింపై 62 బంతుల్లో సెంచరీ సాధించాడు. అయితే సర్ఫరాజ్ ఖాన్ కేవలం 56 బంతుల్లోనే సెంచరీ మార్కును చేరుకుని ‘హిట్‌మ్యాన్’ రికార్డును చెరిపివేశాడు. దీనితో ముంబై తరపున అత్యంత వేగవంతమైన శతకాన్ని అందుకున్న బ్యాటర్‌గా సర్ఫరాజ్ నిలిచాడు.
Also Read: రైడర్లకు గుడ్ న్యూస్.. భారీ ఆఫర్లు ప్రకటించిన జోమాటో, స్విగ్గీ!
సర్ఫరాజ్ ఖాన్ విధ్వంసం
గోవాతో జరిగిన ఈ మ్యాచ్‌లో 4వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సర్ఫరాజ్ ఆరంభం నుంచే సిక్సర్ల వర్షం కురిపించాడు. 75 బంతుల్లోనే 157 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్ 9 ఫోర్లు, 14 భారీ సిక్సర్లు బాదాడు. సర్ఫరాజ్ ఖాన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌కు తోడుగా ఇతర బ్యాటర్లు కూడా రాణించారు. ముషీర్ ఖాన్ 66 బంతుల్లో 60 పరుగులు సాధించాడు. యశస్వి జైస్వాల్ 64 బంతుల్లో 46 పరుగులు చేశాడు. దీనితో ముంబై నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 444 పరుగుల భారీ స్కోరు సాధించింది. గోవా జట్టు విజయం సాధించాలంటే 445 పరుగులు చేయాల్సి ఉంది.
సర్ఫరాజ్ టెస్ట్ కెరీర్
సర్ఫరాజ్ ఖాన్ దేశవాళీ క్రికెట్‌లోనే కాకుండా భారత జట్టు తరపున టెస్టుల్లోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన 6 టెస్టుల్లో 37.10 సగటుతో 371 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి.