పాక్ కెప్టెన్‌కు సూర్యకుమార్ కౌంటర్.. ఏమన్నాడంటే?
టీమ్ ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
- Author : Gopichand
Date : 14-02-2026 - 8:32 IST
Published By : Hashtagu Telugu Desk
Suryakumar Yadav: కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో భారత్- పాకిస్తాన్ మధ్య జరగబోయే ఈ మ్యాచ్‌పై అభిమానులందరి కళ్లు నిలిచాయి. ఈ మ్యాచ్‌లో రాణించాలనే ఒత్తిడి రెండు జట్లపై స్పష్టంగా కనిపిస్తోంది. ఈ టోర్నమెంట్లో ఇప్పటివరకు రెండు జట్లు చెరో 2 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ‘సూపర్ 8’లో తన స్థానాన్ని ఖాయం చేసుకుంటుంది. ఈ మహా సమరానికి ముందు భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో 5 కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్లేయింగ్ 11 గురించి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఏమన్నారంటే..?
టీమ్ ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్లేయింగ్ 11 గురించి హింట్ ఇస్తూ.. అభిషేక్ శర్మ పునరాగమనం దాదాపు ఖాయమని స్పష్టం చేశారు. పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా ప్రకటనపై సరదాగా స్పందిస్తూ.. “పాకిస్థాన్ కెప్టెన్ కోరుకుంటే మేము ఖచ్చితంగా అభిషేక్ శర్మను ఆడిస్తాం” అని అన్నారు.
Also Read: TG Municipal Elections Results : కవితకు బిగ్ షాక్ ఇచ్చి..కాంగ్రెస్‌లో చేరిన వడ్డేపల్లి స్వతంత్రులు
అలాగే, ఉస్మాన్ తారిక్ గురించి మాట్లాడుతూ.. “పరీక్షలో సిలబస్ వెలుపల ప్రశ్న వస్తే మీరు దాన్ని వదిలేయరు కదా, సమాధానం చెప్పడానికే ప్రయత్నిస్తారు. మేము కూడా అదే చేస్తాం. వింత యాక్షన్ ఉన్న బౌలర్ల నెట్స్‌లో మేము ప్రాక్టీస్ చేయలేదని కాదు. పరిస్థితికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకుని బరిలోకి దిగుతాం” అని సూర్య తెలిపారు.
హ్యాండ్‌షేక్ వివాదంపై స్పందన
హ్యాండ్‌షేక్ వివాదం గురించి అడిగినప్పుడు పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా ఆ నిర్ణయాన్ని సూర్యకే వదిలేశారు. దీనిపై సూర్య స్పందిస్తూ.. “మరో 24 గంటలు వేచి చూడండి. బాగా తినండి, హాయిగా నిద్రపోండి, రేపు ఏమవుతుందో చూద్దాం” అని బదులిచ్చారు. అంతేకాకుండా పాకిస్తాన్ జట్టును ప్రశంసిస్తూ.. “పాకిస్తాన్ ఇటీవల కాలంలో మంచి క్రికెట్ ఆడుతోంది. వారు కొంతకాలంగా శ్రీలంకలోనే ఉన్నారు కాబట్టి ఇక్కడి పరిస్థితులు వారికి అనుకూలంగా ఉంటాయి” అని పేర్కొన్నారు.
భారత్-పాక్ మ్యాచ్ ఒత్తిడి గురించి మాట్లాడుతూ.. “ఒత్తిడి ఎప్పుడూ ఉంటుంది. ముఖ్యంగా భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే అదొక గొప్ప అవకాశం లాంటిది. మేము దీన్ని ‘కేవలం ఒక మ్యాచ్’ అని ఎంత చెప్పినా ఒత్తిడికి గురవ్వడం అనేది మనిషి సహజ లక్షణం. ఎందుకంటే ఇది సాధారణ మ్యాచ్ కాదు. మేము వారితో తరచుగా ఆడము కాబట్టి ఆ ఒత్తిడి ఎప్పుడూ ఉంటుంది” అని సూర్యకుమార్ యాదవ్ వివరించారు.