Rohit Sharma: రోహిత్ టార్గెట్ అదే
భారత క్రికెట్ లో కెప్టెన్ గా రోహిత్ శర్మ హవా ఘనంగా ప్రారంభమైంది. స్వదేశంలో వెస్టిండీస్ , శ్రీలంక జట్లపై పరిమిత ఓవర్ల సిరీస్ లను క్లీన్ స్వీప్ చేయడం ద్వారా తన కెప్టెన్సీ ప్రయాణానికి అదిరిపోయే ఆరంభం లభించింది.
- By Naresh Kumar Published Date - 03:20 PM, Thu - 3 March 22

భారత క్రికెట్ లో కెప్టెన్ గా రోహిత్ శర్మ హవా ఘనంగా ప్రారంభమైంది. స్వదేశంలో వెస్టిండీస్ , శ్రీలంక జట్లపై పరిమిత ఓవర్ల సిరీస్ లను క్లీన్ స్వీప్ చేయడం ద్వారా తన కెప్టెన్సీ ప్రయాణానికి అదిరిపోయే ఆరంభం లభించింది. ఇప్పుడు లంకతో టెస్ట్ సిరీస్ తో పూర్తిస్థాయి కెప్టెన్ గా హిట్ మ్యాన్ శకం మొదలుకానుంది. శ్రీలంకతో శుక్రవారం నుండి మొహలీ వేదికగా జరగనున్న టెస్ట్ మ్యాచ్ తో మళ్ళీ ప్రపంచ ర్యాంకింగ్స్ లో టీమిండియాను నెంబర్ వన్ గా నిలబెట్టడమే లక్ష్యంగా రోహిత్ బరిలోకి దిగుతున్నాడు. స్వదేశంలో భారత జట్టుకు గెలుపు అవకాశాలు ఎక్కువే. టీమిండియాతో పోలిస్తే పెద్దగా బలంగా లేని లంక ఎంతవరకూ పోటీనిస్తుందనేది తప్ప భారత గెలుపు లాంఛనంగానే కనిపిస్తోంది. ప్రస్తుతం ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో రెండో స్థానంలో ఉన్న భారత్ ఖాతాలో 116 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఆస్ట్రేలియా 119 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. లంకతో సిరీస్ ద్వారా రేటింగ్ పాయింట్స్ మెరుగయ్యే అవకాశముంది. ఈ సిరీస్ ను భారత్ 2-0తో గెలిస్తే .. అటు పాక్ పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా సిరీస్ పరాజయం పాలైతే టీమిండియాకు టాప్ ప్లేస్ దక్కుతుంది.
ఇదిలా ఉంటే హిట్ మ్యాన్ కు అసలైన సవాళ్ళు ఐపీఎల్ తర్వాత నుండీ మొదలుకానున్నాయి. జూన్ నుండి ఎక్కువ విదేశీ పర్యటనలు ఉండడంతో అక్కడ జట్టును ఎలా నడిపిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. సొంతగడ్డ కావడం, బలహీనంగా ఉన్న విండీస్, లంకపై సిరీస్ విజయాలు సునాయాసంగా అందుకోవడంతో రోహిత్ కెప్టెన్సీకి పూర్తిమార్కులు వేయలేం. అయితే ఇంగ్లాండ్ టూర్, తర్వాత టీ ట్వంటీ వరల్డ్ కప్.. ఇలా విదేశీ జట్లపై సిరీస్ విజయాలను అందుకుంటే భారత క్రకెట్ లో రోహిత్ శర్మ శకం మొదలైనట్టేనని చెప్పొచ్చు. ప్రస్తుతం లంకతో సిరీస్ ను స్వీప్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న హిట్ మ్యాన్ కు పెద్ద కష్టం కాకపోవచ్చు.
అన్ని విభాగాల్లోనూ ప్రత్యర్థి కంటే బలంగా ఉండడమే దీనికి కారణం. లంక ఈ మధ్య కాలంలో ఏ విదేశీ జట్టును ఓడించింది లేదు. దీనికి తోడు గత రికార్డులు కూడా భారత్ కే పూర్తి అనుకూలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో లంకపై టెస్ట్ సిరీస్ విజయం కూడా రోహిత్ కు నల్లేరుపై నడకేనని చెప్పొచ్చు. అయితే తుది జట్టు కూర్పే రోహిత్ కు అసలు సమస్య. ప్రతీ స్థానానికీ కనీసం ఇద్దరు నుంచి ముగ్గురు పోటీపడుతుండడంతో ఎవరిని తుది జట్టులోకి తీసుకుంటాడనేది హిట్ మ్యాన్ కు తలనొప్పే. అటు కొత్త కోచ్ ద్రావిడ్ సైతం తుది జట్టు కూర్పుపై తర్జన భర్జన పడుతున్నాడు. కాగా వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకే లక్ష్యంగా తుది జట్టు కూర్పు ఉండబోతున్నట్టు తెలుస్తోంది. దీని ప్రకారం చూస్తే మిడిలార్డర్ లో పలువురు ఆటగాళ్ళకు మ్యాచ్ కో అవకాశం వస్తుందని భావిస్తున్నారు.