ఐపీఎల్ 2026 షెడ్యూల్.. కీలక విషయాలివే!
ఇంతకుముందు వచ్చిన నివేదికల ప్రకారం.. ఐపీఎల్ రాబోయే సీజన్ మార్చి 28 నుండి ప్రారంభమై, మే 31న ఫైనల్ మ్యాచ్ జరగవచ్చని భావిస్తున్నారు. అయితే అంతకుముందు మార్చి 26 నుండి మే 30 వరకు ఉండవచ్చని వార్తలు వచ్చాయి.
- Author : Gopichand
Date : 10-03-2026 - 8:02 IST
Published By : Hashtagu Telugu Desk
IPL 2026: ఐపీఎల్ 2026 షెడ్యూల్‌కు సంబంధించి చర్చలు ఊపందుకున్నాయి. టీ20 ప్రపంచకప్ ఫైనల్ జరిగిన రోజున (ఆదివారం, మార్చి 8) క్లోజింగ్ సెర్మనీకి ముందు లీగ్ రాబోయే సీజన్ షెడ్యూల్‌ను విడుదల చేస్తారని మొదట భావించారు. కానీ అది సాధ్యపడలేదు. ఇప్పుడు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి దేవ్‌జిత్ సైకియా షెడ్యూల్ గురించి ఒక ముఖ్యమైన అప్‌డేట్ ఇచ్చారు. షెడ్యూల్ విడుదలయ్యే తేదీని, అందులోని ఒక కీలకమైన మార్పును ఆయన వెల్లడించారు.
12 మార్చి నాటికి షెడ్యూల్ విడుదల
వార్తా సంస్థ IANSతో మాట్లాడుతూ బీసీసీఐ కార్యదర్శి మాట్లాడుతూ.. “మేము మార్చి 12 నాటికి ఐపీఎల్ 2026 షెడ్యూల్‌ను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాము. ప్రస్తుతం మేము మొదటి 20 రోజులకు సంబంధించిన షెడ్యూల్‌ను మాత్రమే విడుదల చేస్తాము” అని తెలిపారు. నివేదికల ప్రకారం.. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మొదటి అర్ధభాగం (ఫస్ట్ హాఫ్) షెడ్యూల్‌ను క్లియర్ చేసింది. కాబట్టి ప్రస్తుతానికి కేవలం ప్రారంభ 20 రోజుల షెడ్యూల్ మాత్రమే విడుదల కానుంది.
Also Read: భారత్ ఘనవిజయం.. బీసీసీఐ ఏం చేసిందంటే?
ఎన్నికల ప్రభావం
ఐపీఎల్ షెడ్యూల్ విడుదల కావడంలో జాప్యానికి ప్రధాన కారణం ఎన్నికలు. ఈ ఏడాది (2026) పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాల్లో కూడా ఐపీఎల్ మ్యాచ్‌లు జరగాల్సి ఉన్నందున ఎన్నికల షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ జాగ్రత్తగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందుకే షెడ్యూల్‌ను విడతలవారీగా విడుదల చేయాలని నిర్ణయించారు.
లీగ్ ఎప్పుడు ప్రారంభం కావచ్చు?
ఇంతకుముందు వచ్చిన నివేదికల ప్రకారం.. ఐపీఎల్ రాబోయే సీజన్ మార్చి 28 నుండి ప్రారంభమై, మే 31న ఫైనల్ మ్యాచ్ జరగవచ్చని భావిస్తున్నారు. అయితే అంతకుముందు మార్చి 26 నుండి మే 30 వరకు ఉండవచ్చని వార్తలు వచ్చాయి. అధికారిక షెడ్యూల్ విడుదలైన తర్వాతే అసలైన తేదీలు స్పష్టమవుతాయి. టోర్నమెంట్ ఎప్పుడు ప్రారంభమవుతుంది? షెడ్యూల్ ఎన్ని దశల్లో విడుదలవుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.