India vs Pakistan: టీమిండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ కూడా డౌటే.. ఎందుకంటే..?
టీ20 వరల్డ్ కప్ లో అక్టోబర్ 23న భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌పై వర్షం ప్రభావం చూపే అవకాశం ఉంది. క్రికెట్ అభిమానులకు ఈ వార్త చాలా నిరాశ కలిగించే వార్త.
- By Gopichand Published Date - 05:35 PM, Wed - 19 October 22

టీ20 వరల్డ్ కప్ లో అక్టోబర్ 23న భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌పై వర్షం ప్రభావం చూపే అవకాశం ఉంది. క్రికెట్ అభిమానులకు ఈ వార్త చాలా నిరాశ కలిగించే వార్త. అక్టోబర్ 23 (ఆదివారం) మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో టీమ్ ఇండియా తన తొలి మ్యాచ్ ను ఆడనుంది. అక్కడి వాతావరణ నివేదికల ప్రకారం.. ఆదివారం జరగనున్న భారత్ vs పాకిస్తాన్ T20 ప్రపంచ కప్ మ్యాచ్‌పై వర్షం ముప్పు పొంచి ఉందని తెలుస్తోంది. అక్టోబర్ 23న 65 శాతం వర్షం కురిసే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. వర్షం వస్తే మ్యాచ్ కు ఆటంకం ఏర్పడుతుంది.
మెల్‌బోర్న్‌కు గురువారం తర్వాత వర్షం ముప్పు పొంచి ఉందని సమాచారం. గురువారం కొద్దిపాటి చినుకులు పడే అవకాశం ఉండగా.. ఆ తరవాత మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్టోబర్ 23న భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ రోజంతా దాదాపు 80 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది. 10 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ రోజు వర్షం కురిస్తే ఫ్యాన్స్ డీలా పడటం ఖాయం. ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తుంటారన్న విషయం తెలిసిందే. ఇండియా- పాక్ మ్యాచ్‌కు రిజర్వ్ డే లేదు. ఆ రోజు వర్షం ఏకధాటిగా కురిస్తే మాత్రం మ్యాచ్ లేనట్లే అవుతుంది. సెమీ ఫైనల్స్, ఫైనల్స్‌కు మాత్రం రిజర్వ్ డేను కల్పించారు నిర్వాహకులు.
టీమిండియా, పాకిస్తాన్ చివరిసారిగా ఆసియా కప్ 2022లో తలపడ్డాయి. రెండు జట్లు రెండుసార్లు ముఖాముఖిగా నిలిచాయి. ఇందులో ఒకసారి ఇండియా పాక్ పై గెలుపొందగా.. మరొక మ్యాచ్‌లో పాకిస్తాన్ తన ఓటమికి ప్రతీకారంగా భారత్ పై విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే.. ఈనెల 23న జరగనున్న ఈ మ్యాచ్ టిక్కెట్లు హాట్ కేక్ లా అమ్ముడైన విషయం కూడా తెలిసిందే.