Rishabh Pant: రిషబ్ పంత్ స్థానంలో జట్టులోకి రానున్న ఇషాన్ కిషన్..?!
ప్రస్తుతం సిరీస్‌లో భారత్ 1-2తో వెనుకబడి ఉంది. ఈ సిరీస్‌లో పంత్ భారత జట్టుకు ఒక కీలక ఆటగాడు. అతని ప్రదర్శన అద్భుతంగా ఉంది. ఇప్పటికే రెండు సెంచరీలు సాధించి మంచి ఫామ్‌లో ఉన్నాడు.
- By Gopichand Published Date - 03:55 PM, Thu - 24 July 25

Rishabh Pant: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాల్గవ టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మొదటి రోజు ఆటలో గాయపడిన స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) కాలి బొటనవేలు ఎముక విరిగినట్లు (ఫ్రాక్చర్) నిర్ధారణ అయ్యింది. దీంతో అతను ప్రస్తుత టెస్ట్ సిరీస్ నుండి పూర్తిగా తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. న్యూస్ ఏజెన్సీ పీటీఐకి బీసీసీఐ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం.. పంత్ కనీసం 6 వారాల పాటు మైదానంలో ఆడలేని పరిస్థితిలో ఉన్నాడని తెలుస్తోంది.
పంత్ గాయం.. ఇషాన్ కిషన్‌కు అదృష్టం
మొదటి రోజు బ్యాటింగ్ చేస్తున్న పంత్ 37 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇంగ్లాండ్ పేసర్ క్రిస్ వోక్స్ వేసిన బంతిని రివర్స్ స్వీప్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్‌ను తప్పి నేరుగా అతని కాలికి బలంగా తగిలింది. పంత్ తీవ్ర నొప్పితో అక్కడే కుప్పకూలిపోయాడు. నడవడానికి ప్రయత్నించినా కుదరకపోవడంతో అతన్ని వెంటనే మైదానం నుండి అంబులెన్స్‌లో తీసుకెళ్లారు.
Also Read: Donald Trump: భారతీయులకు అమెరికాలో ఉద్యోగాలు ఇవ్వొద్దు.. ట్రంప్ సంచలన ప్రకటన!
ఒకవేళ పంత్ సిరీస్ నుండి తప్పుకుంటే అతని స్థానంలో యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్‌కు భారత జట్టులోకి తిరిగి వచ్చే అవకాశం లభించింది. ఇషాన్ చివరిసారిగా భారత తరపున 2023లో టెస్ట్ మ్యాచ్ ఆడాడు. సుమారు రెండేళ్ల తర్వాత అతనికి మళ్ళీ జట్టులో చోటు దక్కవచ్చు. “స్కాన్ రిపోర్ట్‌లో ఫ్రాక్చర్ కనిపించింది. అతను ఆరు వారాల పాటు ఆడలేరు. బీసీసీఐ త్వరలో అతని రీప్లేస్‌మెంట్‌ను ప్రకటిస్తుంది. ఇషాన్ కిషన్ రీప్లేస్‌మెంట్‌గా ఉండవచ్చు” అని బీసీసీఐ వర్గాలు పీటీఐకి వెల్లడించాయి.
భారత జట్టుకు విజయం అత్యవసరం
ప్రస్తుతం సిరీస్‌లో భారత్ 1-2తో వెనుకబడి ఉంది. ఈ సిరీస్‌లో పంత్ భారత జట్టుకు ఒక కీలక ఆటగాడు. అతని ప్రదర్శన అద్భుతంగా ఉంది. ఇప్పటికే రెండు సెంచరీలు సాధించి మంచి ఫామ్‌లో ఉన్నాడు. నాలుగో టెస్ట్ మొదటి రోజు కూడా గాయపడక ముందు అతను అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఈ కీలక సమయంలో పంత్ జట్టుకు దూరం కావడం భారత్‌కు పెద్ద దెబ్బగా క్రీడా పండితులు భావిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం భారత జట్టుకు అత్యంత అవసరం. ఒకవేళ ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోతే సిరీస్‌ను కోల్పోయే ప్రమాదం ఉంది. పంత్ లేని లోటును జట్టు ఎలా పూడ్చుకుంటుంది? ఇషాన్ కిషన్ ఈ అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటాడు అనేది చూడాలి.