Test Captain: టెస్టు కెప్టెన్సీ నుంచి రోహిత్ ఔట్..? టీమిండియాకి కొత్త కెప్టెన్ గా యంగ్ ప్లేయర్..? ఈ ఏడాది చివర్లో కొత్త కెప్టెన్ తో బరిలోకి..!
రోహిత్ శర్మ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం ఖాయమని భావిస్తున్నారు. టెస్టు జట్టుకి కొత్త కెప్టెన్ (Test Captain)గా ఎవరూ ఊహించని పేరు చర్చలో ఉన్నట్లు తెలుస్తుంది.
- By Gopichand Published Date - 04:12 PM, Wed - 21 June 23

Test Captain: ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో ఓటమి తర్వాత టీంఇండియాలో పెను మార్పులు చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. రోహిత్ శర్మ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం ఖాయమని భావిస్తున్నారు. టెస్టు జట్టుకి కొత్త కెప్టెన్ (Test Captain)గా ఎవరూ ఊహించని పేరు చర్చలో ఉన్నట్లు తెలుస్తుంది. టెస్టు ఫార్మాట్‌లో టీమిండియా కొత్త కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్‌ను నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయ్యర్‌కు టెస్టు ఆడిన అనుభవం లేదు. అయితే అతనికి అనుకూలంగా చాలా విషయాలు జరుగుతున్నాయి.
అయ్యర్ ఇప్పటి వరకు ఆడిన 10 టెస్టు మ్యాచ్‌ల్లో బాగా బ్యాటింగ్ చేశాడు. అంతే కాకుండా ఐపీఎల్‌లో అయ్యర్ తన కెప్టెన్సీని నిరూపించుకున్నాడు. 2020లో అయ్యర్ నాయకత్వంలో ఢిల్లీ క్యాపిటల్స్ తొలిసారి ఫైనల్స్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. జస్ప్రీత్ బుమ్రాకు పదే పదే గాయాలు కావడం అయ్యర్ వాదనను బలపరుస్తోంది. రిషబ్ పంత్ ఎప్పుడు తిరిగి వస్తాడనే ప్రశ్న ఉంది. అంతే కాకుండా చాలా కాలం తర్వాత తిరిగి వచ్చినా పంత్ మునుపటిలా రాణిస్తాడా లేదా అనే దానిపై సందేహం నెలకొని ఉంది. కేఎల్ రాహుల్‌కు టెస్టు క్రికెట్‌లో ఎన్నో అవకాశాలు వచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఈ కారణాల వల్ల కూడా సెలెక్టర్లు అయ్యర్ పై మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది చివరి నాటికి టెస్టు జట్టు కమాండ్‌ను రోహిత్ శర్మ నిర్వహించే అవకాశం లేదని తేలిపోయింది. రోహిత్ శర్మ వయస్సు 36 సంవత్సరాలు. తదుపరి WTC ఫైనల్ వరకు ఆడటం అతనికి సాధ్యం కాదు. రోహిత్ శర్మ ఫామ్, ఫిట్‌నెస్ రెండూ ప్రశ్నల వలయంలో మిగిలిపోయాయి.
అయితే వచ్చే నెలలో జరిగే వెస్టిండీస్ పర్యటనలో టెస్టు జట్టు కమాండ్ రోహిత్ శర్మకే ఉంటుంది. దీని తర్వాత ఏడాది చివర్లో టీమిండియా.. దక్షిణాఫ్రికాలో పర్యటించాల్సి ఉంది. ఆ పర్యటనలో భారత్‌కు కొత్త కెప్టెన్ వచ్చే అవకాశం ఉంది. గాయం కారణంగా అయ్యర్ ప్రస్తుతం దూరంగా ఉన్నాడు. ఆసియా కప్‌లో అయ్యర్ తిరిగి వచ్చే అవకాశం ఉంది. ప్రపంచకప్ తర్వాత హార్దిక్ పాండ్యాను వన్డే, టీ20 ఫార్మాట్‌లో కెప్టెన్‌గా ప్రకటించవచ్చు.