IND vs SA: సౌతాఫ్రికాతో తొలి టెస్ట్.. మొదటిరోజు టీమిండియాదే!
భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అద్భుతంగా రాణించి 14 ఓవర్లలో కేవలం 27 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇది బుమ్రా టెస్ట్ కెరీర్‌లో 16వ సారి 5 వికెట్లు (ఫైవ్-వికెట్ హాల్) తీయడం.
- By Gopichand Published Date - 06:15 PM, Fri - 14 November 25
IND vs SA; కోల్‌కతాలో భారత్- సౌత్ ఆఫ్రికా (IND vs SA) మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు ఒక వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది. టీమ్ ఇండియా ఇంకా తొలి ఇన్నింగ్స్‌లో 122 పరుగుల లోటులో ఉంది. ఓపెనర్ జైశ్వాల్ వికెట్ కోల్పోయిన తర్వాత ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. జట్టు మేనేజ్‌మెంట్ ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకుంటూ సాధారణంగా మూడో స్థానంలో ఆడే సాయి సుదర్శన్‌కు బదులుగా వాషింగ్టన్ సుందర్‌ను నంబర్-3లో బ్యాటింగ్‌కు పంపింది. సుందర్ ఇప్పటివరకు నిలకడగా బ్యాటింగ్ చేశాడు. రాహుల్‌తో కలిసి సుందర్ 19 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
159 పరుగులకే దక్షిణాఫ్రికా ఆలౌట్
దక్షిణాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 159 పరుగులకే ఆలౌటైంది. ఐడెన్ మార్కరం, రియాన్ రికెల్టన్ 57 పరుగుల భాగస్వామ్యంతో మంచి ఆరంభాన్ని ఇచ్చారు. అయితే ఆ తర్వాత కెప్టెన్ టెంబా బావుమా, టోనీ డి జార్జి సహా ఇతర బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. ఒకానొక సమయంలో 3 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసిన సౌత్ ఆఫ్రికా.. ఆ తర్వాత కేవలం 29 పరుగుల వ్యవధిలో మిగిలిన 7 వికెట్లను కోల్పోయింది.
Also Read: Local Body Elections: సర్పంచ్ ఎన్నికలపై బిగ్ అప్డేట్.. ఆరోజే క్లారిటీ?!
బుమ్రా 5 వికెట్ల ప్రదర్శన
భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అద్భుతంగా రాణించి 14 ఓవర్లలో కేవలం 27 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇది బుమ్రా టెస్ట్ కెరీర్‌లో 16వ సారి 5 వికెట్లు (ఫైవ్-వికెట్ హాల్) తీయడం. బుమ్రా అవుట్ చేసిన వారిలో ఐడెన్ మార్కరం, రయాన్ రికెల్టన్, టోనీ డి జార్జి, సైమన్ హార్మర్, కేశవ్ మహరాజ్ ఉన్నారు. బుమ్రాతో పాటు, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ చెరో రెండు వికెట్లు తీశారు. అలాగే అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టాడు.
భారత్ బ్యాటింగ్ వివరాలు
తొలి రోజు ఆట ముగిసే సమయానికి కేఎల్ రాహుల్ 59 బంతుల్లో 13 పరుగులు, మూడవ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి వచ్చిన వాషింగ్టన్ సుందర్ 38 బంతుల్లో 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. సాయి సుదర్శన్‌కు నంబర్-3లో అవకాశం దక్కకపోవడం ఆశ్చర్యకరమైన విషయంగా మారింది.