IND vs PAK: భారత్- పాకిస్థాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్.. పాక్ స్టాండ్ ఇదే..!
ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత భారత జట్టుతో ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు పాకిస్థాన్ (IND vs PAK) క్రికెట్ బోర్డు ప్రతిపాదనను సిద్ధం చేస్తోందని అనేక మీడియా నివేదికల్లో పేర్కొంది.
- By Gopichand Published Date - 09:11 AM, Tue - 23 July 24

IND vs PAK: గత కొన్ని రోజులుగా భారత్-పాక్ మధ్య టీ20 క్రికెట్ సిరీస్ చర్చలు జరుగుతున్నాయి. ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత భారత జట్టుతో ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు పాకిస్థాన్ (IND vs PAK) క్రికెట్ బోర్డు ప్రతిపాదనను సిద్ధం చేస్తోందని అనేక మీడియా నివేదికల్లో పేర్కొంది. ఈ సిరీస్‌ను భారత్ లేదా పాకిస్థాన్‌లో కాకుండా వేరే దేశంలోని క్రికెట్ స్టేడియంలో నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు ఈ చర్చపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ స్వయంగా తన స్టాండ్‌ను వెల్లడించారు.
పీసీబీ చైర్మన్ ఏం చెప్పారు?
ఇండియా టుడేలోని ఒక నివేదిక ప్రకారం.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ భారత్‌తో టి 20 క్రికెట్ సిరీస్ ఆడటానికి ఎటువంటి ప్రతిపాదన చేయలేదని, ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీని విజయవంతంగా నిర్వహించడంపైనే తమ దృష్టి అంతా ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతం మాకు ఇదే అతిపెద్ద సవాలు అన్నారు. పాకిస్థాన్ క్రికెట్ అంతర్జాతీయ షెడ్యూల్ కూడా చాలా బిజీగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌తో ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లు ఆడే ప్రశ్నే తలెత్తదని ఆయన పేర్కొన్నట్లు సమాచారం.
Also Read: Free Internet: మొబైల్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ప్రతి ఒక్కరికి ఉచితంగా డేటా..?
రెండు జట్ల మధ్య చివరి ద్వైపాక్షిక సిరీస్ ఎప్పుడు జరిగింది?
2012-13లో భారత్-పాక్ మధ్య చివరి ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. ఆ తర్వాత పాకిస్థాన్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించింది. 25 డిసెంబర్ 2012 నుండి 6 జనవరి 2013 వరకు భారతదేశం- పాకిస్తాన్ 2 T20, 3 ODI మ్యాచ్‌ల సిరీస్‌ను ఆడాయి. టీ20 క్రికెట్ సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకోగా, వన్డే సిరీస్‌ను పాకిస్థాన్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. కాగా, టెస్టు క్రికెట్ గురించి మాట్లాడుకుంటే.. భారత్-పాకిస్థాన్ మధ్య చివరి టెస్టు సిరీస్ 2007లో జరిగింది. పాకిస్థాన్‌లో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను భారత్ 1-0తో కైవసం చేసుకుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా పరిస్థితి స్పష్టంగా లేదు
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరగనుంది. ఈ టోర్నీలో ఆడేందుకు భారత జట్టు పాకిస్థాన్‌లో పర్యటించే అవకాశాలు చాలా తక్కువ. భారత జట్టు పాకిస్థాన్‌లో పర్యటించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కోరుతోంది. అయితే ఈ విషయంలో బీసీసీఐ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ టోర్నీలో భారత్‌కు చెందిన అన్ని మ్యాచ్‌లను దుబాయ్ లేదా శ్రీలంకలో నిర్వహించవచ్చని సమాచారం.