టీ20 వరల్డ్ కప్లో విజయ యాత్ర కొనసాగిస్తున్న భారత్ జట్టు!
టీ20 వరల్డ్ కప్ 2026లో టీమ్ ఇండియా విజయ యాత్ర కొనసాగుతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో భారత జట్టు నమీబియాను 93 పరుగుల తేడాతో చిత్తు చేసింది.
- Author : Gopichand
Date : 12-02-2026 - 10:45 IST
Published By : Hashtagu Telugu Desk
IND vs NAM: టీ20 వరల్డ్ కప్ 2026లో టీమ్ ఇండియా విజయ యాత్ర కొనసాగుతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో భారత జట్టు నమీబియాను 93 పరుగుల తేడాతో చిత్తు చేసింది. టీమ్ ఇండియా నిర్దేశించిన 210 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా జట్టు, కేవలం 116 పరుగులు మాత్రమే చేసి కుప్పకూలిపోయింది.
బౌలింగ్లో వరుణ్ చక్రవర్తి నమీబియా బ్యాటర్లకు ఒక అంతుచిక్కని ప్రశ్నలా మారారు. ఆయన కేవలం 7 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నారు. మరోవైపు అక్షర్ పటేల్ కూడా తన స్పిన్ మాయాజాలంతో ఆకట్టుకున్నారు. అంతకుముందు బ్యాటింగ్లో ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా మెరుపు వేగంతో ఆడి అర్ధ సెంచరీలు సాధించారు.
Also Read: కంటి చూపు కోల్పోయిన పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్!
ముక్కలైన నమీబియా బ్యాటింగ్ ఆర్డర్..
భారత్ నిర్దేశించిన 210 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నమీబియాకు మంచి ప్రారంభమే లభించింది. జాన్ ఫ్రైలింక్, లారెన్ స్టీన్కాంప్ కలిసి మొదటి వికెట్కు 33 పరుగులు జోడించారు. ఫ్రైలింక్ 15 బంతుల్లో 22 పరుగులు చేసి అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. నికోల్ లాఫ్టీ ఈటన్ 13 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
మరో ఓపెనర్ స్టీన్కాంప్ 20 బంతుల్లో 29 పరుగులు చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ 18 పరుగులకే వెనుదిరిగాడు. ఆ తర్వాత నమీబియా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. దీంతో చూస్తుండగానే ఆ జట్టు కేవలం 116 పరుగులకే కుప్పకూలింది. టీమ్ ఇండియా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి కేవలం 7 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టగా, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా తలో రెండు వికెట్లు తీశారు.