Washington Sundar: వాషింగ్టన్ సుందర్‌కు వరంగా మారిన కోచ్ గంభీర్ మాటలు!
సుందర్, జడేజాతో కలిసి క్రీజ్‌పై దృఢంగా నిలబడి ఐదో వికెట్‌కు ఏకంగా 203 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సుందర్ 206 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 101 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టు ఓటమిని తప్పించాడు.
- Author : Gopichand
Date : 28-07-2025 - 2:53 IST
Published By : Hashtagu Telugu Desk
Washington Sundar: ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో వాషింగ్టన్ సుందర్ (Washington Sundar) (101 నాటౌట్), రవీంద్ర జడేజా (107 నాటౌట్) (అజేయ 203 పరుగుల భాగస్వామ్యం) అద్భుతమైన పోరాటంతో టీమ్ ఇండియాను పరాజయం నుండి కాపాడి మ్యాచ్‌ను డ్రాగా ముగించారు. సుందర్ తన టెస్ట్ కెరీర్‌లో మొదటి సెంచరీని అత్యంత కీలకమైన సమయంలో సాధించి, తన బ్యాటింగ్ సత్తాను నిరూపించుకున్నాడు. అయితే ఈ చారిత్రాత్మక ఇన్నింగ్స్ వెనుక హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన వ్యాఖ్యలు ఉన్నాయని సుందర్ స్వయంగా వెల్లడించాడు.
సుందర్-జడేజా భాగస్వామ్యం
నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ ఇండియా 188 పరుగులకే కేఎల్ రాహుల్ వికెట్ కోల్పోయి, 40 పరుగుల వ్యవధిలోనే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వికెట్‌ను కూడా కోల్పోయింది. అప్పటికి టీమ్ ఇండియా పరాజయం అంచున నిలబడింది. రిషభ్ పంత్ గాయంతో బాధపడుతుండటంతో, టీమ్ మేనేజ్‌మెంట్ రవీంద్ర జడేజాకు బదులుగా వాషింగ్టన్ సుందర్‌ను ముందుగా బ్యాటింగ్‌కు పంపింది. ఈ నిర్ణయం భారత జట్టుకు పెద్ద వరంగా మారింది.
సుందర్, జడేజాతో కలిసి క్రీజ్‌పై దృఢంగా నిలబడి ఐదో వికెట్‌కు ఏకంగా 203 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సుందర్ 206 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 101 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టు ఓటమిని తప్పించాడు.
Also Read: America: ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో భారతీయుల అమెరికా ఆశలు గల్లంతేనా?
మ్యాచ్ డ్రా అయిన తర్వాత.. సుందర్ జియోహాట్‌స్టార్‌తో మాట్లాడుతూ తన అద్భుత ఇన్నింగ్స్ వెనుక ఉన్న రహస్యాన్ని వెల్లడించాడు. టెస్టు ఐదో రోజు ఉదయం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తనతో చెప్పిన మాటలను సుందర్ గుర్తుచేసుకున్నాడు. “ఈ టెస్ట్ సెంచరీ చాలా ప్రత్యేకం. నేను రోజంతా పోరాడాలని కోరుకున్నాను. అదే సందేశాన్ని కోచ్ గంభీర్ నాకు ఇచ్చారు” అని సుందర్ తెలిపాడు. గంభీర్ ఇచ్చిన ఈ సూచన సుందర్‌కు ఒక గురుమంత్రంగా మారి, ఒత్తిడిలోనూ అద్భుత ప్రదర్శన చేయగలిగేలా ప్రేరణనిచ్చిందని స్పష్టమవుతోంది.
పరాజయాన్ని తప్పించిన భారత పోరాటం
మొదటి ఇన్నింగ్స్ ఆధారంగా ఇంగ్లండ్‌కు 311 పరుగుల భారీ ఆధిక్యం లభించడంతో ఈ టెస్టులో భారత జట్టు ఓటమి దాదాపు ఖాయమని అందరూ భావించారు. అయితే, భారత బ్యాట్స్‌మెన్‌లు గట్టి పోరాటానికి సిద్ధపడ్డారు. శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ జోడీ నాలుగో రోజు మొత్తం ఇంగ్లిష్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. రాహుల్ 90 పరుగులు చేయగా, శుభ్‌మన్ గిల్ సిరీస్‌లో మరో సెంచరీ సాధించాడు. వీరిద్దరూ ఔట్ కాగానే భారత అభిమానుల్లో ఆందోళన మొదలైంది. కానీ సుందర్, జడేజా అజేయమైన భాగస్వామ్యంతో ఇంగ్లండ్ విజయ ఆశలపై నీళ్లు చల్లి, మ్యాచ్‌ను డ్రా చేయగలిగారు. ఇది భారత క్రికెట్ చరిత్రలో నిస్సందేహంగా గుర్తుండిపోయే ఒక గొప్ప పోరాటం.