BCCI President: బీసీసీఐకి కొత్త అధ్యక్షుడు.. రేసులో ఉన్నది వీరేనా?
సెప్టెంబర్‌లో జరిగే ఏజీఎంలో కొన్ని పదవులకు మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. ఈ సంవత్సరం ఎన్నికలు బీసీసీఐ సొంత నియమాల ప్రకారం జరుగుతాయి.
- By Gopichand Published Date - 10:30 AM, Thu - 4 September 25

BCCI President: బీసీసీఐకి త్వరలో కొత్త అధ్యక్షుడిని (BCCI President) నియమించనున్నారు. అంతే కాకుండా ఐపీఎల్‌కు కొత్త చైర్మన్ లభించవచ్చు. ఈ రెండు నిర్ణయాలు సెప్టెంబర్ చివరి వారంలో జరిగే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశంలో (AGM) తీసుకోవచ్చు. ఈ సమావేశం చాలా కీలకం కానుంది. సమాచారం ప్రకారం.. ఇదే సమావేశంలో అధ్యక్షుడు, కార్యదర్శి, ఉపాధ్యక్షుడు, జాయింట్ సెక్రటరీ, కోశాధికారి, ఐపీఎల్ చైర్మన్ పదవులకు ఎన్నికలు జరుగుతాయి.
ఐపీఎల్ ప్రస్తుత చైర్మన్ అరుణ్ ధుమల్ పదవీకాలం ఆరేళ్లు పూర్తయింది. ఇప్పుడు ఆయన మూడు సంవత్సరాల తప్పనిసరి (కూలింగ్ ఆఫ్) బ్రేక్‌కు వెళ్లే అవకాశం ఉంది. ఈ విషయాన్ని చాలా వరకు ఖరారు చేశారు. బయటకి వచ్చిన వార్తల ప్రకారం.. అరుణ్ ధుమల్ స్థానంలో అనేక పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఐపీఎల్ కొత్త చైర్మన్ ఎవరు?
ఐపీఎల్ చైర్మన్ పదవికి రెండు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అందులో మొదటిది ముంబై క్రికెట్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి సంజయ్ నాయక్ కాగా రెండవ పేరు ప్రస్తుత బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా. అయితే ఇప్పటి వరకు తుది నిర్ణయం తీసుకోలేదు. మీడియా రిపోర్ట్స్ ప్రకారం.. కాంగ్రెస్ నాయకుడు శుక్లా మరోసారి ఐపీఎల్ చైర్మన్ అయితే బీహార్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, రాష్ట్రంలోని బీజేపీ నాయకుడు రాకేశ్ తివారి బీసీసీఐ ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశం ఉంది.
Also Read: Bigg Boss: బిగ్‌బాస్ 9 కంటెస్టెంట్ల జాబితా లీక్.? సోషల్ మీడియాలో చర్చ హీట్..!
బీసీసీఐకి కొత్త అధ్యక్షుడు లభిస్తారా?
ఈ సమావేశంలో అత్యంత ఆసక్తికరమైన ఎన్నిక బీసీసీఐ అధ్యక్ష పదవికి జరుగుతుంది. ఎందుకంటే జూలైలో 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రోజర్ బిన్నీని ప్రస్తుత నిబంధనల ప్రకారం మళ్లీ ఎన్నుకోలేరు. ఆయన స్థానంలో ఒక గొప్ప భారతీయ క్రీడాకారుడిని కొత్త అధ్యక్షుడిగా నియమించే అవకాశాలున్నాయి. పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక సీనియర్ బీసీసీఐ అధికారి పీటీఐతో మాట్లాడుతూ.. ‘ప్రతిష్ఠాత్మక క్రికెటర్‌ను ఎల్లప్పుడూ అధ్యక్షుడిగా ఎన్నుకోవాలనే అభిప్రాయం ముఖ్యమైన వాటాదారులలో ఉంది. సౌరవ్ గంగూలీ ఒక గౌరవనీయమైన భారతీయ కెప్టెన్. రోజర్ బిన్నీ భారతదేశపు మొదటి ప్రపంచ కప్ విజేత నాయకుడు. అయితే ఈ ఉన్నత పదవిపై ఎంతమంది ప్రతిష్ఠాత్మక క్రికెటర్లు ఆసక్తి చూపుతారు అనేది పెద్ద ప్రశ్న’ అని చెప్పారు.
ఈ పదవుల్లో మార్పు ఉండదు
ప్రస్తుతానికి జాయింట్ సెక్రటరీ, కార్యదర్శిగా మొత్తం మూడేళ్లు పూర్తి చేసుకున్న దేవ్జిత్ సైకియా తన పదవిలో కొనసాగుతారు. అదేవిధంగా జాయింట్ సెక్రటరీస్ రోహన్ గౌన్స్ దేశాయ్, ప్రభతేజ్ భాటియా కూడా తమ పదవుల్లో కొనసాగుతారు. ఎందుకంటే వారికి ఇది కార్యనిర్వహణలో మొదటి సంవత్సరం.
బీసీసీఐ నియమాల ప్రకారం ఎన్నికలు
సెప్టెంబర్‌లో జరిగే ఏజీఎంలో కొన్ని పదవులకు మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. ఈ సంవత్సరం ఎన్నికలు బీసీసీఐ సొంత నియమాల ప్రకారం జరుగుతాయి. ఎందుకంటే జాతీయ క్రీడా పరిపాలన చట్టం అమలులోకి రావడానికి ఇంకా కొంత సమయం పట్టవచ్చు. కాబట్టి బోర్డు అంత ఎక్కువ కాలం వేచి ఉండదు.