Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా ఎప్పుడు దుబాయ్ వెళ్తుందో తెలుసా?
ప్రస్తుతం ఇంగ్లండ్‌తో టీం ఇండియా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతోంది. ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు జరగ్గా అందులో భారత్ 2 గెలవగా, ఇంగ్లండ్ ఒక మ్యాచ్‌లో గెలిచింది.
- By Gopichand Published Date - 08:42 AM, Fri - 31 January 25

Champions Trophy: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 (Champions Trophy) ఫిబ్రవరి 19 నుండి ప్రారంభం కానుంది. ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు టీమ్ ఇండియా పాకిస్థాన్ వెళ్లటంలేదు. టీమ్ ఇండియా మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో హైబ్రిడ్ మోడల్‌లో జరుగుతాయి. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు ఎప్పుడు దుబాయ్ వెళ్తుందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఇప్పుడు దీనికి సంబంధించి పెద్ద అప్డేట్ ఒకటి వెలువడింది.
ఫిబ్రవరి 15న దుబాయ్‌కు టీమిండియా
టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. భారత జట్టు ఫిబ్రవరి 15న దుబాయ్‌కి బయలుదేరవచ్చు. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం కూడా త్వరలో వెల్లడికానుంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో జరిగే తొలి మ్యాచ్‌కు ముందు భారత్‌కు ఎలాంటి వార్మప్ మ్యాచ్ లభించే అవకాశం లేదని నివేదిక పేర్కొంది.
ప్రస్తుతం ఇంగ్లండ్‌తో టీం ఇండియా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతోంది. ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు జరగ్గా అందులో భారత్ 2 గెలవగా, ఇంగ్లండ్ ఒక మ్యాచ్‌లో గెలిచింది. ఆ తర్వాత ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది. వన్డే సిరీస్‌లో చివరి మ్యాచ్ ఫిబ్రవరి 12న అహ్మదాబాద్‌లో జరగనుంది. అనంతరం ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ ఇండియా దుబాయ్ వెళ్లనుంది.
Also Read: Prime Minister Modi: ఫిబ్రవరి 5న ప్రధాని మోదీ ప్రయాగ్‌రాజ్ టూర్ క్యాన్సిల్!
ఫిబ్రవరి 20 నుంచి టీమ్ ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ ప్రచారాన్ని ప్రారంభించనుంది. బంగ్లాదేశ్‌తో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 23న భారత్-పాక్‌ల మధ్య పోరు జరగనుంది. రోహిత్ శర్మ మరోసారి టీమిండియా కెప్టెన్‌గా కనిపించనున్నాడు.
కెప్టెన్ల ఫోటోషూట్, విలేకరుల సమావేశం లేదు
ఛాంపియన్స్ ట్రోఫీకి కెప్టెన్లందరి ఫోటోషూట్, ప్రెస్ కాన్ఫరెన్స్ లేనట్లు తెలుస్తోంది. దీంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పాకిస్థాన్ వెళ్లాల్సిన పనిలేదు. టోర్నీ ప్రారంభం కావడానికి 19 రోజులు మాత్రమే మిగిలి ఉంది. కానీ పాకిస్థాన్‌లోని స్టేడియాలు ఇంకా పూర్తిగా సిద్ధంగా లేవని వార్తలు వస్తున్నాయి.