Karun Nair: కంటతడి పెట్టిన కరుణ్ నాయర్.. ఓదార్చిన కేఎల్ రాహుల్, ఇదిగో ఫొటో!
దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత భారత టెస్ట్ జట్టులోకి తిరిగి వచ్చిన కరుణ్ నాయర్ నుంచి ఇంగ్లండ్ పర్యటనలో అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
- By Gopichand Published Date - 03:07 PM, Fri - 25 July 25

Karun Nair: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరుగుతున్న నాల్గవ టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు తమ ప్లేయింగ్ ఎలెవన్‌లో మూడు కీలక మార్పులు చేసింది. ఈ మార్పులలో భాగంగా వరుసగా ఆరు ఇన్నింగ్స్‌లలో నిరాశపరిచిన కరుణ్ నాయర్ (Karun Nair)ను జట్టు నుంచి తప్పించారు. కరుణ్ స్థానంలో సాయి సుదర్శన్‌కు తుది జట్టులో చోటు దక్కింది. ఈ పరిణామాల మధ్య కరుణ్ నాయర్ తీవ్రంగా ఏడుస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో కేఎల్ రాహుల్ కరుణ్‌ను ఓదార్చుతూ కనిపించడం అభిమానులను కూడా భావోద్వేగానికి గురిచేసింది.
కరుణ్ నాయర్ భావోద్వేగం
దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత భారత టెస్ట్ జట్టులోకి తిరిగి వచ్చిన కరుణ్ నాయర్ నుంచి ఇంగ్లండ్ పర్యటనలో అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే, వరుసగా మూడు టెస్ట్ మ్యాచ్‌లలో అవకాశాలు లభించినప్పటికీ బ్యాట్‌తో అతను పెద్దగా రాణించలేకపోయాడు. కరుణ్ అనేక ఇన్నింగ్స్‌లలో మంచి ఆరంభాలు చేసినప్పటికీ వాటిని పెద్ద స్కోర్లుగా మలచలేకపోయాడు. మొత్తం ఆరు ఇన్నింగ్స్‌లలో కరుణ్ కేవలం 131 పరుగులు మాత్రమే చేయగా, 40 అతని అత్యధిక స్కోరు. ప్రతిసారీ మంచి టచ్‌తో కనిపించినా.. కొన్ని మంచి షాట్లు ఆడినప్పటికీ కరుణ్ తన వికెట్‌ను చేజార్చుకొని పెవిలియన్‌కు చేరాడు. ఈ కారణంగానే నాల్గవ టెస్ట్‌లో అతన్ని ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తప్పించారు.
Also Read: Caste Survey: కుల గణన ద్వారా తెలంగాణ ప్రజలకు ఉపయోగం ఉందా? ప్రయోజనాలు అందుతాయా?
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కరుణ్ ఫోటోలో అతను తీవ్రంగా రోదిస్తూ కనిపించడం అభిమానులను కలిచివేసింది. అతని స్నేహితుడు కేఎల్ రాహుల్ కరుణ్‌ను ఓదార్చుతూ ఉండటం కూడా ఈ ఫోటోలో స్పష్టంగా కనిపిస్తుంది. కరుణ్ పరిస్థితి చూసిన కొంతమంది అభిమానులు అతను బహుశా రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నాడని అభిప్రాయపడుతున్నారు.
I feel very bad to see Karun Nair crying like this. I wish the team management would give him another chance to prove himself. 💔🥺 pic.twitter.com/NF5jfMotSZ
— KLR (@KLRNation1) July 24, 2025
8 సంవత్సరాల తర్వాత పునరాగమనం
కరుణ్ నాయర్ 2017లో ట్రిపుల్ సెంచరీ సాధించిన తర్వాత భారత జట్టు నుంచి దూరమయ్యాడు. అయితే, దేశీయ క్రికెట్‌లో నిలకడైన ప్రదర్శనలతో ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత జట్టులోకి తిరిగి రాగలిగాడు. హెడింగ్లీలో జరిగిన మొదటి టెస్ట్‌లో కరుణ్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశం లభించింది. మొదటి ఇన్నింగ్స్‌లో ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరగా, రెండవ ఇన్నింగ్స్‌లో 20 పరుగులు చేశాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో జట్టు యాజమాన్యం అతన్ని నంబర్ మూడు స్థానంలో ఆడించినా అక్కడ కూడా పెద్దగా రాణించలేకపోయాడు. లార్డ్స్‌లో కరుణ్ మొదటి ఇన్నింగ్స్‌లో 40 పరుగులు చేయగా, రెండవ ఇన్నింగ్స్‌లో కేవలం 14 పరుగులు మాత్రమే చేయగలిగాడు.