ICC Test Rankings: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్.. సత్తా చాటిన టీమిండియా ఆటగాళ్లు!
ఐసిసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సిరీస్‌లో భాగంగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 295 పరుగుల తేడాతో విజయం సాధించిన సమయంలో బుమ్రా 8 వికెట్లు పడగొట్టాడు.
- Author : Gopichand
Date : 27-11-2024 - 2:51 IST
Published By : Hashtagu Telugu Desk
ICC Test Rankings: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలోని పెర్త్ టెస్టులో 295 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా ఆటగాళ్లు తాజాగా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో (ICC Test Rankings) భారీగా లాభపడ్డారు. బుధవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో జస్ప్రీత్ బుమ్రా మళ్లీ నంబర్ 1 బౌలర్‌గా నిలిచాడు. ఈ ర్యాంకింగ్‌లో యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ కూడా లాభపడ్డారు. పెర్త్‌లో ఆస్ట్రేలియాపై బుమ్రా అద్భుతమైన ప్రదర్శన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. భారత స్టార్ బౌలర్ బుమ్రా తన కెరీర్-బెస్ట్ ర్యాంకింగ్‌ను తిరిగి పొందాడు. తాజాగా ఐసీసీ పురుషుల టెస్టు బౌలర్ ర్యాంకింగ్స్‌లో మళ్లీ నంబర్ 1 ప్లేయర్‌గా నిలిచాడు.
ఐసిసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సిరీస్‌లో భాగంగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 295 పరుగుల తేడాతో విజయం సాధించిన సమయంలో బుమ్రా 8 వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. ఈ ప్రదర్శన కారణంగా బుమ్రా తన పాత ర్యాంకింగ్ నుండి రెండు స్థానాలు ఎగబాకాడు. అతను దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబడా, ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్‌లను వెనక్కినెట్టి మొదటి స్థానంలో నిలిచాడు. ఈ విధంగా అతను టెస్ట్ బౌలింగ్‌లో ఐసిసి ర్యాంకింగ్‌లో మళ్లీ సింహాసనాన్ని ఆక్రమించాడు.
2024 ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో విశాఖపట్నం టెస్టులో 9 (6+3) వికెట్లు తీసిన తర్వాత బుమ్రా తొలిసారి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఆ తర్వాత అక్టోబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లో అతను మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్నాడు. అయితే ఇటీవలి వారాల్లో అతన్ని కగిసో రబాడ అధిగమించాడు.
Also Read: Mallika Sagar Blunder: ఐపీఎల్ 2025 మెగా వేలంలో మల్లికా సాగర్ మిస్టేక్ చేసిందా?
మహ్మద్ సిరాజ్ ఐసీసీ ర్యాంకింగ్‌లో కూడా లాభపడ్డాడు
టీమిండియా మరో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ కూడా ర్యాంకింగ్‌లో లాభపడ్డాడు. ఈ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ పెర్త్‌లో ఆస్ట్రేలియాపై 5 వికెట్లు పడగొట్టాడు. దీంతో మూడు స్థానాలు మెరుగుపడి 25వ స్థానానికి చేరుకున్నాడు.
టెస్ట్ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ అనుభవజ్ఞుడైన జో రూట్ ఇప్పటికీ నంబర్ 1 ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. కానీ యశస్వి జైస్వాల్ ఇప్పుడు ర్యాంకింగ్‌లో అతనికి సవాలు విసిరాడు. ఇప్పుడు తాజా ర్యాంకింగ్స్‌లో యశస్వి జైస్వాల్ నంబర్ 2 టెస్ట్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియాతో రెండో ఇన్నింగ్స్‌లో అద్భుత సెంచరీ సాధించాడు. ఈ చారిత్రాత్మక ఇన్నింగ్స్ కారణంగా అతను రెండు స్థానాలు ఎగబాకి రెండో స్థానానికి చేరుకున్నాడు. ఆస్ట్రేలియా ఫాస్ట్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్ పెర్త్‌లో 89 పరుగుల ఇన్నింగ్స్ తర్వాత మూడు స్థానాలు ఎగబాకి 10వ స్థానానికి చేరుకున్నాడు.
అదే సమయంలో విరాట్ కోహ్లీ తన 30వ టెస్టు సెంచరీ తర్వాత తొమ్మిది స్థానాలు ఎగబాకి 13వ స్థానానికి చేరుకున్నాడు. పెర్త్ టెస్టులో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శన చేశాడు. అతను సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. ఇప్పుడు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ పెద్ద ఫీట్ చేశాడు. 22వ స్థానం నుంచి 13వ స్థానానికి భారీగా దూసుకెళ్లాడు.