BCCI : రోహిత్ – కోహ్లి రిటైర్మెంట్‌పై బీసీసీఐ క్లారిటీ..!
- By Vamsi Chowdary Korata Published Date - 03:02 PM, Wed - 15 October 25

భారత క్రికెట్ జట్టులో సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల భవిష్యత్తు గురించిన ఊహాగానాలకు బీసీసీఐ స్పష్టతనిచ్చింది. రానున్న భారత – ఆస్ట్రేలియా వన్డే సిరీస్ వీరిద్దరికీ చివరిదని వస్తున్న వార్తలను బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఖండించాడు. ఆటగాళ్ల రిటైర్మెంట్ నిర్ణయం పూర్తిగా వారిదేనని ఆయన పేర్కొన్నాడు.
వెస్టిండీస్పై భారత్ రెండో టెస్ట్లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన అనంతరం శుక్లా మాట్లాడుతూ “రోహిత్ – విరాట్ లాంటి అద్భుతమైన బ్యాటర్లు జట్టులో ఉండటం భారత్కు పెద్ద బలమే. వారిద్దరి ఆధ్వర్యంలో టీమిండియా మరిన్ని విజయాలు సాధిస్తుంది. ఇది వాళ్ల చివరి సిరీస్ అని చెప్పడం పూర్తిగా తప్పు. రిటైర్ ఎప్పుడు అవ్వాలి అనే నిర్ణయం ఆటగాళ్లదే. ఇలాంటి ఊహాగానాలు అవసరం లేదు” అన్నాడు.
ఇదే సమయంలో యువ ఆటగాళ్లలో శుభమన్ గిల్కి వన్డే కెప్టెన్సీ ఇవ్వడం, అభిషేక్ శర్మ, ప్రభ్సిమ్రాన్ సింగ్, తిలక్ వర్మల లాంటి కొత్త ప్రతిభలు ఎదగడం వల్ల రో-కో జంట భవిష్యత్తుపై చర్చలు మొదలయ్యాయి. 2027లో జరగనున్న వన్డే ప్రపంచకప్ నాటికి రోహిత్కి 40, విరాట్కి 39 ఏళ్లు నిండనున్నాయి.
అయితే, బీసీసీఐ మాత్రం దీన్ని భవిష్యత్తు ప్రణాళికలో భాగంగా చూస్తోంది. “రోహిత్, విరాట్ ఉన్నంత వరకు జట్టుకు స్థిరత్వం ఉంటుంది. కొత్త తరానికి మార్గదర్శకులుగా వారు కొనసాగుతారు” అని బోర్డు వర్గాలు తెలిపాయి.
రోహిత్ శర్మ 273 వన్డేల్లో 32 సెంచరీలు, 58 హాఫ్ సెంచరీలతో 11,168 పరుగులు సాధించాడు. విరాట్ కోహ్లి ఇప్పటివరకు 302 వన్డేల్లో 14,181 పరుగులు సాధించి, 51 సెంచరీలు, 74 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఇద్దరూ ఇప్పటికే టెస్ట్, టీ20 ఫార్మాట్లకు గుడ్బై చెప్పి ప్రస్తుతం కేవలం వన్డేలకు మాత్రమే అందుబాటులో ఉంటున్నారు.
వెస్టిండీస్పై 2 – 0తో సిరీస్ గెలిచిన యువ కెప్టెన్ శుభమన్ గిల్ నేతృత్వంలోని టీమిండియాను శుక్లా ప్రశంసించాడు. “ఆస్ట్రేలియా పర్యటనకు ముందు ఈ విజయంతో మన జట్టుకు విశ్వాసం పెరిగింది. ఆస్ట్రేలియాలో గెలిచే అవకాశాలు ఉన్నాయని నమ్ముతున్నాను” అని అన్నాడు.