Border Gavaskar Trophy: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఓటమికి కారణాలు ఇవేనా?
బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లోని ప్రతి మ్యాచ్‌లోనూ దాదాపు భిన్నమైన కాంబినేషన్‌తో భారత జట్టు రంగంలోకి దిగింది. బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో టీమ్ మేనేజ్‌మెంట్ పూర్తిగా అయోమయంలో పడింది.
- By Gopichand Published Date - 07:43 PM, Sun - 5 January 25

Border Gavaskar Trophy: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (Border Gavaskar Trophy) చేజారిపోయింది. కంగారూ గడ్డపై వరుసగా మూడోసారి విజయ పతాకాన్ని ఎగురవేయాలన్న టీమిండియా కల కలగానే మిగిలిపోయింది. సిడ్నీలో టీమిండియా బ్యాట్స్‌మెన్‌లు మరోసారి నిరాశపరిచారు. జస్ప్రీత్ బుమ్రా లేకపోవడంతో టీమ్ ఇండియా నాల్గో ఇన్నింగ్స్‌లో 161 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడంలో విఫలమైంది. ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి ఉల్లాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. ఈ సిరీస్ భారత జట్టు ముందు ఎన్నో పెద్ద ప్రశ్నలను మిగిల్చింది. ఆస్ట్రేలియా గడ్డపై రోహిత్ సేన ఐదు తప్పిదాల వల్ల ఓడిపోయినట్లు తెలుస్తోంది.
జట్టు ఎంపికలో లోపాలు
బోర్డర్-గవాస్కర్ సిరీస్‌కు ఎంపికైన భారత జట్టులో అనుభవం కంటే యువ ఆటగాళ్లపైనే ఆధారపడటం జట్టుకు మైనస్‌గా మారింది. పుజారా-రహానే వంటి బ్యాట్స్‌మెన్‌లను విస్మరించడం సెలెక్టర్లకు ఖరీదైనదిగా మారింది. అదే సమయంలో హర్షిత్ రాణా, ఆకాశ్‌దీప్ వంటి యువ బౌలర్లను బౌలింగ్‌లో ప్రయత్నించడం జట్టుకు చాలా కష్టమైంది. బ్యాటింగ్ నుంచి బౌలింగ్ ఎటాక్ వరకు ప్రతి విభాగంలోనూ అనుభవ లేమి భారత జట్టును కుదిపేసింది.
Also Read: Bandi Sanjay: ఇంకెన్నాళ్లీ డైవర్షన్ పాలిటిక్స్.. కేసీఆర్ బాటలోనే రేవంత్ ప్రభుత్వం!
బ్యాట్స్‌మెన్ ఫ్లాప్ షో
ఆస్ట్రేలియా గడ్డపై హ్యాట్రిక్ సాధించాలన్న టీమ్‌ఇండియా కల నెరవేరకుండా పోయింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ వంటి బలమైన బ్యాట్స్‌మెన్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ఈ టూర్‌పై అభిమానులతో పాటు టీమ్ మేనేజ్‌మెంట్ కూడా విరాట్‌పై భారీ అంచనాలు పెట్టుకుంది. అయితే ఆఫ్ స్టంప్ వెలుపలికి వెళ్తున్న బంతుల ముందు పూర్తిగా విఫలమయ్యాడు. రిషబ్ పంత్ కొన్ని బలమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. కానీ అతను ప్రతిసారీ మంచి ప్రారంభాన్ని పెద్ద ఇన్నింగ్స్‌గా మార్చలేకపోయాడు.
కెప్టెన్సీ
బుమ్రా నాయకత్వంలో పెర్త్‌లో జట్టును తిరుగులేని విజయాన్ని సాధించింది. మొదటి టెస్టు తర్వాత తదుపరి మూడు టెస్ట్ మ్యాచ్‌లలో రోహిత్ శర్మ కెప్టెన్సీ చాలా సాధారణంగా కనిపించింది. జట్టు కాంబినేషన్, బౌలింగ్, ఫీల్డింగ్ సెటప్‌లో మార్పులు ఇలా ప్రతి ఏరియాలోనూ కెప్టెన్ రోహిత్ ఘోరంగా విఫలమయ్యాడు. అతని కెప్టెన్సీలో కూడా బ్యాట్ నుండి పరుగులు రాలేదు.
బుమ్రా ఒంటరి పోరాటం
ఆస్ట్రేలియాతో జరిగిన మొత్తం సిరీస్‌లో జస్ప్రీత్ బుమ్రా బంతితో చాలా ప్రదర్శనలు ఇచ్చాడు. కానీ అతను ఇతర ఎండ్‌లోని ఇతర బౌలర్ల నుండి మద్దతు పొందలేకపోయాడు. సిడ్నీ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా బౌలింగ్‌కు రాకపోవడంతో భారత జట్టు బౌలింగ్ ఎటాక్ బట్టబయలైంది. బుమ్రా సిరీస్‌లో మొత్తం 32 వికెట్లు పడగొట్టాడు. కానీ మహ్మద్ సిరాజ్, ఆకాశ్‌దీప్, రవీంద్ర జడేజా బంతితో ప్రత్యేకంగా ఏమీ చూపించలేకపోయారు. మొత్తం సిరీస్‌లో బుమ్రా ఒంటరి పోరాటం చేస్తూ కనిపించాడు.
టీమ్ కాంబినేషన్
బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లోని ప్రతి మ్యాచ్‌లోనూ దాదాపు భిన్నమైన కాంబినేషన్‌తో భారత జట్టు రంగంలోకి దిగింది. బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో టీమ్ మేనేజ్‌మెంట్ పూర్తిగా అయోమయంలో పడింది. కేఎల్ రాహుల్ బ్యాటింగ్ స్థానం తారుమారు కాగా.. నాలుగో టెస్టులో శుభ్‌మన్ గిల్‌ను కూడా జట్టు నుంచి తప్పించారు. ఇద్దరు స్పిన్నర్లతో మెల్‌బోర్న్‌లోకి అడుగుపెట్టాలనే నిర్ణయం పూర్తిగా తప్పుడు నిర్ణయమని తేలింది. ఇదే సమయంలో సిడ్నీ టెస్ట్‌లో ఆరు వికెట్లు తీసిన ప్రసిద్ధ కృష్ణను ప్రారంభ మ్యాచ్‌లలో ప్రయత్నించడం అవసరం అని జట్టు మేనేజ్‌మెంట్ భావించలేదు.