కావ్య మారన్‌కి బిగ్ జలక్.. పాక్ ప్లేయర్ కొనుగోలుపై ఫ్యాన్స్ ఫైర్
- Author : Vamsi Chowdary Korata
Date : 13-03-2026 - 10:20 IST
Published By : Hashtagu Telugu Desk
Kavya Maran ఇంగ్లండ్‌లో జరుగుతున్న ‘ది హండ్రెడ్’ పురుషుల ప్లేయర్ వేలంలో పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను కొనుగోలు చేసిన తర్వాత సన్‌రైజర్స్ లీడ్స్ ఫ్రాంచైజీ వివాదంలో చిక్కుకుంది. భారత యజమాన్యంలోని జట్టు పాకిస్తాన్ ఆటగాడిని ఎంపిక చేయడంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. అబ్రార్‌ను 2.55 లక్షల డాలర్లకు కొనుగోలు చేసిన కొద్ది గంటల్లోనే సన్‌రైజర్స్ లీడ్స్ అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా సస్పెండ్ కావడం ఇప్పుడు సంచలనంగా మారింది.
ఇంగ్లండ్‌లో జరుగుతున్న ది హండ్రెడ్ లీగ్ వేలం తర్వాత ఒక పెద్ద వివాదం చెలరేగింది. భారత యాజమాన్యంలోని ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ లీడ్స్ పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను కొనుగోలు చేయడంతో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. వేలంలో సన్‌రైజర్స్ లీడ్స్ అబ్రార్ అహ్మద్‌ను సుమారు 2.55 లక్షల డాలర్లకు దక్కించుకుంది. దీంతో ‘ది హండ్రెడ్’ టోర్నీలో భారత యాజమాన్యంలోని జట్టు తీసుకున్న మొదటి పాకిస్తాన్ ఆటగాడిగా అబ్రార్ నిలిచాడు.
అయితే ఈ నిర్ణయంతో భారత క్రికెట్ అభిమానుల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. సోషల్ మీడియాలో అనేక మంది అభిమానులు ఫ్రాంచైజీ యజమాని కావ్యమారన్‌ను విమర్శిస్తూ పోస్టులు చేశారు. పాకిస్తాన్ ఆటగాడిని తీసుకోవడం జాతీయ భావనలకు విరుద్ధమని కొందరు అభిప్రాయపడ్డారు. వేలం సమయంలో కావ్య మారన్ టేబుల్ వద్ద జట్టు హెడ్ కోచ్ డానియల్ వెటోరీతో కలిసి కనిపించారు. వేలానికి ముందు ‘ది హండ్రెడ్’లో ఉన్న నాలుగు భారత యాజమాన్య జట్లు పాకిస్తాన్ ఆటగాళ్లపై బిడ్ వేస్తాయా లేదా అనే అంశం చర్చకు దారితీసింది.
ఈ వివాదం మధ్యలోనే మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అబ్రార్ అహ్మద్‌ను కొనుగోలు చేసిన కొన్ని గంటల్లోనే సన్‌రైజర్స్ లీడ్స్ అధికారిక ఎక్స్ ఖాతా సస్పెండ్ అయింది. అకౌంట్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తే అకౌంట్ సస్పెండెడ్ అనే మెసెజ్ కనిపిస్తోంది. అయితే ఈ చర్యకు సంబంధించిన ఖచ్చితమైన కారణాన్ని ప్లాట్‌ఫారమ్ వెల్లడించలేదు. సాధారణంగా ఎక్స్ నిబంధనలను ఉల్లంఘించినప్పుడు ఖాతాలను సస్పెండ్ చేస్తామని మాత్రమే పేర్కొంటుంది.
ఇక సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ యాజమాన్యం విషయానికి వస్తే, భారత మీడియా సంస్థ సన్ టీవీ నెట్వర్క్ గత సంవత్సరం ఈ జట్టును పూర్తిగా స్వాధీనం చేసుకుంది. అప్పటి వరకు నార్తన్ సూపర్ ఛార్జర్స్‌గా పిలిచే ఈ జట్టు పేరు సన్‌రైజర్స్ లీడ్స్‌గా మారింది. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్, సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఫ్రాంఛైజీలు కూడా కావ్యమారన్వే కావడం విశేషం.
జట్టు కోచ్ డేనియల్ వెటోరి మాట్లాడుతూ ఈ నిర్ణయం తీసుకునే ముందు ఆస్ట్రేలియా ఆటగాళ్ల అభిప్రాయం కూడా తెలుసుకున్నామని చెప్పారు. ఈ ఏడాది ప్రారంభంలో అబ్రార్‌ను ఎదుర్కొన్న ఆటగాళ్లు అతని బౌలింగ్ గురించి మంచి అభిప్రాయం వ్యక్తం చేయడంతో అతనిపై ఆసక్తి పెరిగిందని వెల్లడించారు. అయితే వేలానికి ముందు పాకిస్తాన్ ఆటగాళ్లను ఎంపిక చేయాలా వద్దా అనే అంశంపై జట్టులో ప్రత్యేకంగా సమావేశాలు జరగలేదని కూడా ఆయన చెప్పారు.