Petrol price: పెట్రోల్, డీజిల్ ధరలపై ఆర్బీఐ గవర్నర్ షాకింగ్ కామెంట్స్
- Author : Vamsi Chowdary Korata
Date : 13-05-2026 - 2:59 IST
Published By : Hashtagu Telugu Desk
పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచక తప్పదని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు. ఇరాన్ యుద్ధం వల్ల పెరుగుతున్న ఇంధన ధరలు దేశ ద్రవ్యోల్బణ లక్ష్యాలకు సవాలుగా మారుతున్నాయని, దీనిపై ఆర్బీఐ తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఆయన సూచించారు.
స్విట్జర్లాండ్లో మంగళవారం జరిగిన ఒక సదస్సులో మల్హోత్రా మాట్లాడుతూ.. “పశ్చిమాసియా సంక్షోభం ఇలాగే కొనసాగితే, రిటైల్ ఇంధన ధరల పెంపు అనేది కేవలం సమయం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. దీనివల్ల రవాణా ఖర్చులు పెరిగి, ద్రవ్యోల్బణం మరింత అధికమవుతుంది” అని హెచ్చరించారు. ఆర్బీఐ తదుపరి ద్రవ్య పరపతి విధాన సమావేశం జూన్ 5న జరగనుందని, వడ్డీ రేట్లపై అప్పుడు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ సమావేశంలో ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ రెపో రేటును 5.25 శాతం వద్ద యథాతథంగా ఉంచిన సంగతి తెలిసిందే. “పరిస్థితిని బట్టి మా విధానాలు ఉంటాయి. షాక్ తాత్కాలికమైతే సర్దుకుపోతాం. కానీ, అది దీర్ఘకాలం కొనసాగితే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది” అని ఆయన వివరించారు.
మరోవైపు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ.. దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ నిల్వలు సరిపడా ఉన్నాయని అన్నారు. అయితే, ప్రభుత్వ రంగ చమురు సంస్థలు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయని, ధరల పెంపు అనివార్యం కావచ్చని సూచనప్రాయంగా తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్కు 100 డాలర్లు దాటినప్పటికీ, దేశంలో ధరలు పెంచకపోవడంతో ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు రోజుకు దాదాపు రూ.1,000 కోట్ల నష్టాన్ని భరిస్తున్నాయని ఆయన వెల్లడించారు.
భారత్ తన ముడి చమురు అవసరాల్లో 88 శాతం దిగుమతి చేసుకుంటోంది. దీనివల్ల అంతర్జాతీయ ధరల పెరుగుదల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఇప్పటివరకు చమురు సంస్థల అండర్-రికవరీలు రూ.1.98 లక్షల కోట్లకు చేరగా, ప్రస్తుత జూన్ త్రైమాసికంలో నష్టాలు రూ.1 లక్ష కోట్లకు దగ్గరగా ఉన్నాయని పూరి తెలిపారు. సరఫరాకు అంతరాయం కలగకుండా ఎల్పీజీ ఉత్పత్తిని పెంచామని, ప్రస్తుతం దేశంలో 76 రోజులకు సరిపడా ముడి చమురు నిల్వలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు ఎక్సైజ్ సుంకాలు తగ్గించడం, చమురు సంస్థలు నష్టాలు భరించడం ద్వారా ప్రభుత్వం ధరలను నియంత్రించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో ధరల పెంపు అనివార్యమనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.