Polavaram Project: పోలవరం నిర్వాసితులకు.. సీఎం జగన్ గుడ్‌న్యూస్..!
- Author : HashtagU Desk
Date : 04-03-2022 - 12:39 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర జనవనరులశాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో ఈరోజు పోలవరం ప్రాజెక్ట్‌ను పరిశీలించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇందుకూరుపేట నిర్వాసితులతో మాట్లాడిన జగన్, పోలవరం నిర్వాసితులను పూర్తిస్థాయిలో ఆదుకుంటామని తెలిపారు. అంతే కాకుండా పోలవరం నిర్వాసితులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6 లక్షలతో పాటు, ఏపీ ప్రభుత్వం మరో 3 లక్షలు అదనంగా ఇస్తుందని జగన్ చెప్పారు. ఏపీకి పోలవరం జీవనాడి అని, పోలవరం పూర్తయితేనే రాష్ట్ర సస్యశ్యామలం అవుతుందని జగన్ అన్నారు.
ఇక పోలవరం ప్రాజెక్ట్‌లో భాగంగా జలాశయం, అనుసంధానాల పనులు ఇప్పటికే 80.6శాతం వరకు పూర్తి అయ్యాయి. అలాగే కుడి కాలువ పనులు 92.57శాతం, ఎడవ కాలువ పనులు 71.11శాతం పూర్తయ్యాయి. ఇక ఇప్పటి వరకు నిర్వాసితులకు పునరావాస కల్పన పనులు 20.19శాతం పూర్తయ్యాయి. పునరావాసం, భూసేకరణ, జలాశయం, కుడి, ఎడమ కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు మొత్తంగా చూస్తే 42.68శాతం పనులు పూర్తయ్యాయి. సీడబ్ల్యూసీ, ఆర్‌సీసీ ఆమోదించిన మేరకు 2017-18 ధరల ప్రకారం పోలవరానికి కేంద్రం నిధులిస్తే ప్రాజెక్టు పనులు సకాలంలో పూర్తవుతాయని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఇకపోతే ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించాక మొదటిసారిగా 2019లో పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన సంగతి తెలిసిందే.