Pakistan Landslide: పాకిస్థాన్‌లో విరిగిపడిన కొండచరియలు.. ఎనిమిది మంది చిన్నారులు మృతి
పాకిస్థాన్‌లోని ఖైబర్ ఫక్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో గురువారం (జూలై 06) కొండచరియలు విరిగిపడి (Pakistan Landslide) ఎనిమిది మంది చిన్నారులు చనిపోయారు. కాగా ఒక చిన్నారి కనిపించడంలేదు.
- Author : Gopichand
Date : 08-07-2023 - 6:44 IST
Published By : Hashtagu Telugu Desk
Pakistan Landslide: పాకిస్థాన్‌లోని ఖైబర్ ఫక్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో గురువారం (జూలై 06) కొండచరియలు విరిగిపడి (Pakistan Landslide) ఎనిమిది మంది చిన్నారులు చనిపోయారు. కాగా ఒక చిన్నారి కనిపించడంలేదు. స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. షాంగ్లా జిల్లాలోని మార్తుంగ్ ప్రాంతంలో పిల్లలు క్రికెట్ ఆడుతుండగా కొండచరియలు విరిగిపడ్డాయి. పిల్లలందరి వయస్సు 12-14 సంవత్సరాల మధ్య ఉన్నట్లు సమాచారం. మీడియా కథనాల ప్రకారం.. ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 9 నుండి 14 మంది పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు. అప్పుడు భారీ కొండచరియలు విరిగిపడ్డాయి.
ఈ ప్రమాదంలో ఎనిమిది మంది చిన్నారులు మృతి చెందగా, ఒక చిన్నారి గల్లంతైనట్లు సమాచారం. కొండచరియలు విరిగిపడిన శిథిలాలలో కొంత మంది చిన్నారులు చిక్కుకోగా, వారిని సహాయక చర్యలు చేపట్టి రక్షించారు. రెస్క్యూ ఆపరేషన్ తర్వాత రక్షించబడిన పిల్లలలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది, అతన్ని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు.
Also Read: Odisha Train Tragedy : ఒడిశా రైలు దుర్ఘటన కేసు.. ముగ్గురిని అరెస్టు చేసిన సీబీఐ
ఈ ఏడాది కూడా వరద భయం
పాక్‌లోని పలు ప్రాంతాల్లో మరోసారి భారీ వర్షాలు కురుస్తుండటం గమనార్హం. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి విధ్వంసం సృష్టించే అవకాశం పెరిగింది. గత రెండు వారాలుగా కురుస్తున్న వర్షాలకు మృతుల సంఖ్య గురువారం (జూలై 6) నాటికి 55కి చేరింది. బుధవారం, లాహోర్‌లో పైకప్పు కూలిపోవడం, విద్యుదాఘాతం కారణంగా 19 మంది మరణించారు. భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకు 15 జంతువులు చనిపోగా, 62 ఇళ్లు కూలిపోయాయి.
జీలం, చీనాబ్‌లు ఉప్పొంగుతున్నాయి
ఈ సీజన్‌లో కూడా పాకిస్తాన్‌లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయని, దీని కారణంగా పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న జీలం, చీనాబ్ నదులు ఉప్పొంగుతున్నాయని అధికారులు తెలిపారు. కుండపోత వర్షాల దృష్ట్యా విపత్తు నిర్వహణ సంస్థలు అప్రమత్తమయ్యాయి. ప్రస్తుతం నగదు కొరతతో సతమతమవుతున్న పాకిస్థాన్‌లో వరదల కారణంగా 2022లో 30 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. దీంతో దాదాపు 1,739 మంది చనిపోయారు.