Odisha Train Tragedy : ఒడిశా రైలు దుర్ఘటన కేసు.. ముగ్గురిని అరెస్టు చేసిన సీబీఐ
ఒడిశాలో గత నెలలో జరిగిన ఘోర రైలుప్రమాద ఘటన కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ శుక్రవారం ముగ్గురు రైల్వే ఉద్యోగులను అరెస్టు చేసింది.
- By News Desk Published Date - 07:08 PM, Fri - 7 July 23

గత నెలలో ఒడిశా రైలు ప్రమాదం (Odisha Train Tragedy ) జరిగిన విషయం విధితమే. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ (Coromandel Express), బెంగళూరు – హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (Bangalore – Howrah Superfast Express), గూడ్స్ రైలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. గత రెండు దశాబ్దాలలో భారతదేశంలో జరిగిన అత్యంత ఘోరమైన రైల్వే విషాదాల్లో ఈ ప్రమాదం ఒకటి. ఈ రైలు ప్రమాద ఘటనలో 293 మందికిపైగా మరణించారు. మరో వెయ్యి మందికి గాయాలు కాగా వారికి ఆస్పత్రిలో చికిత్స అందించారు. వీరిలో కొందరు ఇంకా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘోర ప్రమాద ఘటనపై కేంద్ర ప్రభుత్వం సీబీఐ (CBI) దర్యాప్తుకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం ఉద్దేశపూర్వకమేనా? ప్రమాదం వెనుక కుట్ర ఏమైనా ఉందా? అనే కోణంలో సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారు.
ఈ క్రమంలో శుక్రవారం ముగ్గురు రైల్వే ఉద్యోగులను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. సీబీఐ అధికారులు అరెస్టు చేసిన వారిలో అరుణ్ కుమార్ మహంత, ఎండీ అమీర్ ఖాన్, పప్పుకుమార్‌లు ఉన్నారు. వీరిపై నేరపూరిత నరహత్య, సాక్ష్యాలను నాశనం చేసినట్లు అభియోగాలు మోపారు. విచారణలో భాగంగా ఈ ముగ్గురి చర్యలే రైలు ప్రమాద ఘటనకు దారితీశాయని సీబీఐ అధికారులు భావిస్తున్నారు.
ప్రమాదంపై విచారిస్తున్న రైల్వే సేప్టీ కమిషనర్ (సీఆర్ఎస్) గతవారం సిగ్నలింగ్ విభాగంలో కార్మికులు మానవ తప్పిదానికి కారణమని చెప్పారు. విధ్వంసం, సాంకేతిక లోపం, యంత్రలోపం సంభవించే అవకాశం ఉందన్న విషయాన్ని తోసిపుచ్చారు. మూడు సంవత్సరాల క్రితం భద్రతా కారణాల దృష్ట్యా డిజైన్‌లో మార్పులు చేసిన తర్వాత తనిఖీలో తగిన భద్రతా విధానాలను అనుసరించని కొంత మంది గ్రౌండ్ ఆఫీసర్ల నిర్లక్ష్యాన్ని సీఆర్ఎస్ హైలెట్ చేసింది.
Tips to Increase Mileage of a Car: మీ కారు మైలేజ్ రావడం లేదా.. ఈ 4 విషయాలు గుర్తుంచుకోవాల్సిందే?