Medaram Jathara : మినీ మేడారం జాతర పనుల పై మంత్రి సీతక్క సమీక్ష
రానున్న మినీ మేడారం జాతరను పురస్కరించుకొని మంగళవారం సాయంకాలం జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
- By Latha Suma Published Date - 06:43 PM, Tue - 7 January 25

Medaram Jathara : మేడారం జాతర (సమ్మక్క సారలమ్మ జాత) తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునే దేవతలను గౌరవించే గిరిజన పండుగ. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం వద్ద జాతర ప్రారంభమవుతుంది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 12 నుంచి 15వ తేదీ వరకు జరగనుంది. ఈ క్రమంలోనే మినీ మేడారం జాతరకు చేపట్టిన అభివృద్ధి పనులపై మంత్రి సీతక్క ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు.
మినీ మేడారం జాతరకు చేపట్టిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలి. ప్రతి పని నాణ్యతతో చేపట్టి శాశ్వతంగా నిలిచిపోయేలా ఉండాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. మహా జాతర సందర్భంగా జరిగిన చిన్న చిన్న సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. రానున్న మినీ మేడారం జాతరను పురస్కరించుకొని మంగళవారం సాయంకాలం జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
జంపన్న వాగు వద్ద మహిళా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించిన అనంతరం బట్టలు మార్చుకోవడానికి ప్రత్యేక షెడ్యూల్ ఏర్పాటు చేయాలని, భక్తులకు అవసరమయ్యే పనులను త్వరగా చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు. గత పక్షం రోజులుగా భక్తులు రాక పెరిగిపోయిందని, ఫిబ్రవరి మొదటి వారం నుంచే భక్తుల తాకిడి అధికం కానున్న సందర్భంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క సమీక్ష సూచించారు.