AP News : రేపు అమరావతికి తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు.. సీఎంతో భేటీ
AP News : తెలుగు సినీ పరిశ్రమ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కలవనున్న భేటీ తేదీల్లో కీలక మార్పులు జరిగాయి.
- By Kavya Krishna Published Date - 12:32 PM, Sat - 14 June 25

AP News : తెలుగు సినీ పరిశ్రమ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కలవనున్న భేటీ తేదీల్లో కీలక మార్పులు జరిగాయి. గతంలో ఈ నెల 22వ తేదీకి నిర్ణయించిన ఈ సమావేశాన్ని ముందుగానే నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం, సినిమారంగ ప్రముఖులు, తాజా షెడ్యూల్ ప్రకారం రేపు (జూన్ 15)నే అమరావతిలో ముఖ్యమంత్రిని కలవనున్నారు.
రాష్ట్రంలో సినిమా రంగ అభివృద్ధి, చిత్రీకరణకు అనువైన మౌలిక వసతులు, పన్ను రాయితీలు, స్టూడియోలు, ఫిలిం సిటీల అభివృద్ధి తదితర అంశాలపై సీఎంతో సినీ ప్రముఖులు చర్చించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా టాలీవుడ్ పరిశ్రమను విజయవాడ, విశాఖ వంటి ప్రాంతాలకు విస్తరింపజేయాలన్న దిశలో ప్రభుత్వ ప్రణాళికలపై ఈ భేటీలో చర్చ సాగే అవకాశం ఉంది.
ఈ భేటీకి పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతారని అంచనా వేస్తున్నారు. కానీ ఆయన రేపటి నుంచే ఓ సినిమా షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లాల్సి ఉండటంతో, సీఎంతో భేటీకి ముందు సినీ ప్రముఖులు పవన్‌తో ప్రత్యేకంగా సమావేశమై చర్చలు జరిపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సినీ పరిశ్రమను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వ సహకారంతో పాటుగా, ఇండస్ట్రీ అంతర్గత సమన్వయం ఎలా ఉండాలో పవన్ సూచనలు ఇవ్వనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
రేపు సాయంత్రం 4 గంటలకు అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది. మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ నిర్మాతలు, దర్శకులు, కొంతమంది హీరోలు పాల్గొననున్న ఈ సమావేశం మీద సినీ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చలు కొనసాగుతున్నాయి. ఫిలిం ఇండస్ట్రీ అభివృద్ధికి ఇది కీలక మలుపు అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Chennai : ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ తనిఖీలు.. రూ.3.8 కోట్ల విలువైన గంజాయి సీజ్