Amit Shah: “ఇది మోదీ ప్రభుత్వం”.. ఉగ్రవాదులకు అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్!
కార్యక్రమం ప్రారంభంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, ముఖ్యమంత్రి రేఖా గుప్తా, కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన వారికి శ్రద్ధాంజలి అర్పించడానికి రెండు నిమిషాల మౌనం పాటించారు.
- By Gopichand Published Date - 08:06 PM, Thu - 1 May 25

Amit Shah: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారతదేశం తీసుకున్న కఠిన చర్యలతో పాకిస్తాన్ భయాందోళనకు గురైంది. ఈ సందర్భంగా ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ఉగ్రవాదులు, వారి సమర్థకులకు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. కక్షపూరిత దాడి చేసి తాము విజయం సాధించామని ఎవరూ భావించవద్దని, ఎందుకంటే నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతి ఉగ్రవాదిని ఎంచి ఎంచి జవాబు ఇస్తుందని ఆయన అన్నారు.
‘ఉగ్రవాదం అంతం అయ్యే వరకు పోరాటం కొనసాగుతుంది’
కార్యక్రమం ప్రారంభంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, ముఖ్యమంత్రి రేఖా గుప్తా, కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన వారికి శ్రద్ధాంజలి అర్పించడానికి రెండు నిమిషాల మౌనం పాటించారు. షా మాట్లాడుతూ.. ఉగ్రవాదం పూర్తిగా అంతం అయ్యే వరకు భారతదేశం పోరాటం కొనసాగుతుందని చెప్పారు. ఈ హీనమైన చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని ఆయన ఉద్ఘాటించారు.
‘ఎవరినీ విడిచిపెట్టం’
అమిత్ షా మాట్లాడుతూ.. “ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో అది ఈశాన్య భారతమైనా, వామపక్ష తీవ్రవాద ప్రాంతమైనా లేదా కశ్మీర్‌పై పడిన ఉగ్రవాద నీడైనా ప్రతి ఒక్కటికీ మేము దృఢంగా సమాధానం ఇచ్చాము. కాయరత్వపూరిత దాడి చేసి తమకు గొప్ప విజయం సాధించామని ఎవరైనా భావిస్తే, ఇది నరేంద్ర మోదీ ప్రభుత్వమని గుర్తుంచుకోండి. ఎవరినీ విడిచిపెట్టము. ఈ దేశంలోని ప్రతి అంగుళం భూమి నుండి ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించాలనే మా సంకల్పం ఉంది. అది తప్పక సిద్ధించి తీరుతుంది” అని వార్నింగ్ ఇచ్చారు.
ఉగ్రవాదులకు అమిత్ షా హెచ్చరిక
కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. “నేను ఈ రోజు ప్రజలకు చెప్పదలచుకున్నది ఏమిటంటే 90వ దశకం నుండి కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని నడుపుతున్న వారిపై మేము జీరో టాలరెన్స్ విధానంతో దృఢంగా మా పోరాటాన్ని కొనసాగిస్తున్నాము. మా పౌరుల ప్రాణాలను తీస్తే ఈ పోరాటంలో వారు గెలిచారని వారు భావించవద్దు. ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసే ప్రతి ఒక్కరికీ నేను చెప్పదలచుకున్నది ఏమిటంటే ఈ పోరాటం అంతం కాదు. ఇది ఒక మైలురాయి మాత్రమే. ప్రతి ఒక్కరికీ ఎంచి ఎంచి సమాధానం ఇస్తాం.” అని మండిపడ్డారు.