Bomb Attack In Pakistan: పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి.. 12 మంది దుర్మరణం, 40 మందికి పైగా గాయాలు
పాకిస్థాన్ (Pakistan)లోని వాయువ్య ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని పోలీస్ స్టేషన్‌పై సోమవారం రాత్రి జరిగిన బాంబు దాడి (Bomb Attack In Pakistan)లో 8 మంది పోలీసులతో సహా కనీసం 12 మంది మరణించారు. 40 మందికి పైగా గాయపడ్డారు.
- By Gopichand Published Date - 06:41 AM, Tue - 25 April 23

పాకిస్థాన్ (Pakistan)లోని వాయువ్య ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని పోలీస్ స్టేషన్‌పై సోమవారం రాత్రి జరిగిన బాంబు దాడి (Bomb Attack In Pakistan)లో 8 మంది పోలీసులతో సహా కనీసం 12 మంది మరణించారు. 40 మందికి పైగా గాయపడ్డారు. స్వాత్ లోయలోని కబాల్ పోలీస్ స్టేషన్ వద్ద పేలుడు జరిగినట్లు అధికారులు తెలిపారు. పోలీస్ స్టేషన్ కాంప్లెక్స్‌లో కౌంటర్ టెర్రరిజం డిపార్ట్‌మెంట్ (CTD) కార్యాలయం, మసీదు కూడా ఉన్నాయి. ఖైబర్ పఖ్తుంఖ్వా ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అక్తర్ హయత్ ఖాన్ మాట్లాడుతూ.. దాడి తర్వాత ప్రావిన్స్ అంతటా భద్రతా అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. దాడికి బాధ్యులమని ఎవరూ వెంటనే ప్రకటించలేదు. కానీ పాకిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వంతో కాల్పుల విరమణను ముగించిన తర్వాత ఇటీవలి నెలల్లో ఇలాంటి దాడులకు పాల్పడినట్లు డాన్ వార్తాపత్రిక పేర్కొంది.
జియో న్యూస్ ప్రకారం.. జిల్లా పోలీసు అధికారి షఫీ ఉల్లా గండాపూర్ (డిపిఓ) మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ లోపల రెండు పేలుళ్లు సంభవించాయని, దీంతో భవనం కుప్పకూలిందని తెలిపారు. భవనం కూలిపోయి చాలా మంది శిథిలాల కింద చిక్కుకుపోయారని సీటీడీ డీఐజీ ఖలీద్ సోహైల్ తెలిపారు. క్షతగాత్రులను సైదులు షరీఫ్ టీచింగ్ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు సమీపంలోని అన్ని ఆసుపత్రుల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. భవనం కుప్పకూలడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆ దేశ హోం మంత్రి రాణా సనావుల్లా పేలుడు ఘటనను ఖండిస్తూ, ప్రాణ నష్టం పట్ల విచారం వ్యక్తం చేశారు.
Also Read: Flight Catches Fire: నేపాల్‌లో విమాన ప్రమాదం.. విమానంలో మంటలు.. ఖాట్మాండులో ఎమర్జెన్సీ ల్యాండింగ్
ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ తాత్కాలిక ముఖ్యమంత్రి మహ్మద్ ఆజం ఖాన్ కూడా భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడిని తీవ్రంగా ఖండించారు. అలాగే సహాయ, సహాయక చర్యలను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అమరులైన పోలీసు అధికారుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు. పాకిస్తాన్ తీవ్రవాద సంఘటనలు పెరుగుతున్న తరుణంలో తాజా దాడి జరిగింది.
ఉగ్రవాదులు తమ తాజా దాడుల్లో చట్టాన్ని అమలు చేసేవారిని లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఉగ్రవాదులపై భద్రతా సంస్థలు కూడా గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. ప్రస్తుతం ఈ దాడికి ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు. ప్రభుత్వం, ఉగ్రవాద సంస్థ TTP మధ్య కాల్పుల విరమణ ముగిసిన తరువాత, గత కొన్ని నెలలుగా పాకిస్తాన్‌లో ఇటువంటి దాడులు పెరిగాయి. ఈ బాంబు దాడిలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.