PM Modi: రష్యా అధ్యక్షుడు పుతిన్ కోసం ప్రొటోకాల్‌ను బ్రేక్ చేసిన పీఎం మోదీ!
అధ్యక్షుడు పుతిన్ పర్యటన భారత్-రష్యా వ్యూహాత్మక సంబంధాల 25వ వార్షికోత్సవం సందర్భంగా జరుగుతోంది. 2000వ సంవత్సరంలో పుతిన్, అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేసి ఈ సంబంధానికి పునాది వేశారు.
- By Gopichand Published Date - 07:58 PM, Thu - 4 December 25
PM Modi: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన రెండ్రోజుల భారత పర్యటన నిమిత్తం ఢిల్లీకి చేరుకున్నారు. పాలెం విమానాశ్రయంలో పుతిన్ దిగగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రొటోకాల్‌ను బ్రేక్ చేసి మరీ సంప్రదాయబద్ధంగా ఆయనకు ఘన స్వాగతం పలికారు. అధ్యక్షుడు పుతిన్‌ను స్వాగతించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముందుగానే పాలెం విమానాశ్రయంలో ఉన్నారు. పుతిన్ చేరుకోగానే ప్రధాని మోదీ ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని అభివాదం చేశారు. అనంతరం ఇద్దరు నేతలు ఒకే కారులో ప్రధాని నివాసం వైపు బయలుదేరారు. అక్కడ ఇద్దరు నేతల మధ్య విందు (డిన్నర్) జరగనుంది.
మోదీ స్వాగతం గురించి తమకు తెలియదని క్రెమ్లిన్ వెల్లడి
ప్రధాని మోదీ ఇచ్చిన స్వాగతాన్ని చూసి రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ ఒక ఆసక్తికర విషయం వెల్లడించింది. ప్రధాని మోదీ స్వయంగా విమానాశ్రయానికి వచ్చి పుతిన్‌ను రిసీవ్ చేసుకుంటారనే విషయం తమకు తెలియదని క్రెమ్లిన్ పేర్కొంది. విమానాశ్రయంలో ప్రధాని మోదీ హాజరు గురించి రష్యాకు ముందుగా సమాచారం ఇవ్వలేదని క్రెమ్లిన్ తెలిపింది.
Also Read: Akhanda 2 Paid Premieres: ‘అఖండ 2’ ప్రీమియర్ షోలు రద్దు.. రీజన్ ఇదే!
#WATCH | Russian President Vladimir Putin lands in Delhi; Prime Minister Narendra Modi receives him at the airport
President Putin is on a two-day State visit to India. He will hold the 23rd India-Russia Annual Summit with PM Narendra Modi in Delhi on December 5 pic.twitter.com/yB76u5aovS
— ANI (@ANI) December 4, 2025
ఉక్రెయిన్ యుద్ధం తర్వాత తొలి పెద్ద పర్యటన
ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పుతిన్ భారతదేశంలో పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. అందుకే రాజధానిలో దౌత్య, భద్రతాపరమైన ఏర్పాట్లు చాలా కట్టుదిట్టంగా ఉన్నాయి. నగరంలోని అనేక ప్రాంతాల్లో స్వాగత బ్యానర్లు, రష్యా జెండాలు ఏర్పాటు చేయగా, ట్రాఫిక్ మార్గాల్లో మార్పులు, భద్రతా వలయం ఇప్పటికే అమలులో ఉన్నాయి.
రక్షణ మంత్రుల మధ్య ద్వైపాక్షిక చర్చలు ప్రారంభం
ఇదిలా ఉండగా అధ్యక్షుడు పుతిన్ ఢిల్లీకి చేరుకోవడానికి కొంత సమయం ముందుగానే భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రష్యా రక్షణ మంత్రి మధ్య ద్వైపాక్షిక చర్చలు ప్రారంభమయ్యాయి. శిఖరాగ్ర సమావేశానికి ముందు జరుగుతున్న ఈ చర్చలు భారత్-రష్యా రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు చాలా ముఖ్యమైనవిగా భావిస్తున్నారు.
ఈ సమావేశంలో రక్షణ ఉత్పత్తి, ఉమ్మడి తయారీ, సైనిక సాంకేతిక భాగస్వామ్యం, లాజిస్టిక్స్ సహకారం, రాబోయే రక్షణ ప్రాజెక్టులపై సమగ్ర చర్చ జరిగే అవకాశం ఉంది. పుతిన్ పర్యటనకు ముందు రెండు దేశాల రక్షణ యంత్రాంగం మధ్య ఈ సమన్వయం, ఈ పర్యటన వ్యూహాత్మక ప్రాముఖ్యతను మరింత పెంచింది.
పుతిన్ భారత పర్యటన ఎందుకు?
అధ్యక్షుడు పుతిన్ పర్యటన భారత్-రష్యా వ్యూహాత్మక సంబంధాల 25వ వార్షికోత్సవం సందర్భంగా జరుగుతోంది. 2000వ సంవత్సరంలో పుతిన్, అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేసి ఈ సంబంధానికి పునాది వేశారు.