Diwali festival : దీపావళి వేళ..200 కొత్త రైళ్లను ప్రకటించిన ఇండియన్ రైల్వే
Diwali festival ఈ కొత్త రైళ్లకు తోడు పండుగ సీజన్‌లో మరింత మంది ప్రయాణీకుల సౌకర్యార్థం అక్టోబర్ 29, 30 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు పేర్కొంది. రైళ్లకు సంబంధించిన సమాచారాన్ని ఎక్స్ ద్వారా వెల్లడించింది.
- By Latha Suma Published Date - 02:49 PM, Tue - 29 October 24

Indian Railways : దీపావళి పండుగ నేపథ్యంలో ఇండియన్ రైల్వే 200 కొత్త రైళ్లను ప్రకటించింది. పండగ వేళ దేశవ్యాప్తంగా ప్రజలు తమ స్వస్థలాలకు వెళ్తుంటారు. ఈ సమయంలో ఉండే రద్దీని దృష్టిలో ఉంచుకొని రైల్వేస్ ఈ కీలక ప్రకటన చేసింది. ప్రయాణీకులను సురక్షితంగా, సకాలంలో వారి గమ్య స్థానాలకు చేర్చేందుకు ఈ రైళ్లను ప్రవేశపెట్టింది. దేశంలోని అన్ని ప్రాంతాలకు ఈ ట్రైన్స్ నడపనున్నట్టు పేర్కొంది. న్యూఢిల్లీ, పాట్నా, అహ్మదాబాద్, లక్నో, రోహ్‌తక్, పూణే, ముంబైతో పాటు ఇతర ప్రధాన స్టేషన్లను అనుసంధానిస్తూ ఈ సర్వీసులను నడపనున్నట్టు పేర్కొంది. ఈ కొత్త రైళ్లకు తోడు పండుగ సీజన్‌లో మరింత మంది ప్రయాణీకుల సౌకర్యార్థం అక్టోబర్ 29, 30 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు పేర్కొంది. రైళ్లకు సంబంధించిన సమాచారాన్ని ఎక్స్ ద్వారా వెల్లడించింది.
Kind Attention to All Passengers!
Here’s the list of Festival Special Trains set to operate on 29th October 2024. pic.twitter.com/NiJtg01gcj
— Ministry of Railways (@RailMinIndia) October 28, 2024
ఇకపోతే.. పండుగల సమయంలో ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం 7,000 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ రైళ్ల ద్వారా రోజుకు అదనంగా రెండు లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. దీపావళి నేపథ్యంలో స్టేషన్లలో రద్దీని నియంత్రించేందుకు గత ఆదివారం ఇండియన్ రైల్వేస్ కీలక ప్రకటన చేసింది. ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, దాదర్, లోకమాన్య తిలక్ టెర్మినస్, థానే, కళ్యాణ్, పూణే, నాగ్‌పూర్‌తో సహా ఎంపిక చేసిన ప్రధాన స్టేషన్లలో ప్లాట్‌ఫారమ్ టిక్కెట్ల అమ్మకాలపై తాత్కాలిక ఆంక్షలు విధించింది. దీంతో ప్లాట్‌ఫామ్ టికెట్లను పరిమిత సంఖ్యలోనే విక్రయించనున్నారు.