భారీగా పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాలలో తులం బంగారం ధర ఎంతకి చేరిందంటే..
- Author : Vamsi Chowdary Korata
Date : 10-01-2026 - 10:11 IST
Published By : Hashtagu Telugu Desk
Gold Price అంతర్జాతీయంగా అనిశ్చిత సంకేతాల నేపథ్యంలో బంగారం ధరల్లో ఒక్కసారిగా ఊహించని మార్పు సంభవించింది. వరుసగా రెండు రోజులు రేట్లు తగ్గగా.. ఇంకా తగ్గుతాయనుకుంటే నిరాశే ఎదురైంది. రాత్రికి రాత్రే బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్లో భారీ స్థాయిలో ఎగబాకాయి. దేశీయంగా కూడా బంగారం ధర పెరగ్గా.. ఉదయం 10 గంటల తర్వాత మరింత పెరగనున్నాయని చెప్పొచ్చు. ఈ ధరల పెరుగుదలకు కారణాలేంటో మనం ఇప్పుడు చూద్దాం.
పసిడి ప్రియులకు మరోసారి బిగ్ షాక్ తగిలింది. కొత్త సంవత్సరంలోనూ బంగారం ధరలు ఆరంభంలో బారీగా పెరిగి గత 2 రోజులుగా తగ్గాయనుకుంటే మళ్లీ ధరలు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. ఇవాళ రాత్రికి రాత్రే బంగారం ధరల్లో భారీ మార్పు సంభవించింది. ఒక దశలో ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇంట్రాడేలో కిందటి రోజుతో పోలిస్తే దిగొచ్చిన స్పాట్ గోల్డ్ రేటు మళ్లీ ఊహించని స్థాయిలో పెరిగింది. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలే దీనికి కారణం. వెండి ధరలు కూడా అంతర్జాతీయ మార్కెట్లో రికార్డు స్థాయిలో పుంజుకున్నాయి. దీంతో మళ్లీ గోల్డ్, సిల్వర్ రేట్లు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయిలకు చేరువయ్యాయి. దేశీయంగా చూస్తే బంగారం ధర పెరగ్గా.. వెండి ధర తగ్గింది. ఇవాళ (శనివారం) ఉదయం 10 గంటల తర్వాత ఈ రెండింటి ధరలు మళ్లీ భారీ స్థాయిలో పెరగనున్నాయని చెప్పొచ్చు.
ఒకవైపు అమెరికా- ఇరాన్ ఉద్రిక్తతలు.. మరోవైపు ఉక్రెయిన్‌పై మరోసారి రష్యా బాంబుల వర్షం కురిపించడం, క్షిపణి ప్రయోగం చేయడం వంటివి మరోసారి అంతర్జాతీయంగా తాజా ఆందోళనకలు కారణమయ్యాయి. వీటికి తోడు ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై 500 శాతం టారిఫ్స్ విధించేందుకు ఉద్దేశించిన బిల్లుకు ఆమోదం తెలపడం, భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదరకపోవడానికి భారత ప్రధాని మోదీ.. ట్రంప్‌తో నేరుగా మాట్లాడకపోవడమే కారణమని యూఎస్ వాణిజ్య మంత్రి పేర్కొనడం వంటి అంశాలు.. అంతర్జాతీయంగా ఉద్రిక్తతల్ని పెంచాయి. ఈ క్రమంలోనే సురక్షిత పెట్టుబడి సాధనంగా బంగారం, వెండిపైకి ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్ని తరలిస్తున్నారు. దీంతో రేట్లు పెరుగుతున్నాయి.
ఇంటర్నేషనల్ మార్కెట్లో కిందటి రోజు ఒక దశలో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 4,420 డాలర్ల స్థాయికి చేరగా.. రాత్రికి రాత్రే భారీగా పెరిగాయి. చివరికి ఔన్సుకు 4,508.90 డాలర్ల మార్కును తాకింది. గత నెలలో ఇది 4,549 డాలర్ల వద్ద ఆల్ టైమ్ హైని తాకింది. సిల్వర్ రేటు చూస్తే 80.01 డాలర్ల వద్ద స్థిరపడింది. కిందటి రోజు ఇది ఒక దశలో 75 డాలర్లకు దిగొచ్చింది. రాత్రికి రాత్రే బిగ్ ఛేంజ్ కనిపించిందని చెప్పొచ్చు.
దేశీయంగా ధరల్ని గమనిస్తే.. బంగారం ధర గత రెండు రోజులుగా తగ్గగా ఇప్పుడు ఎగబాకింది. హైదరాబాద్ నగరంలో ఇప్పుడు ఒక్కరోజే రూ. 1200 పెరగ్గా 22 క్యారెట్ల పసిడి ధర తులం రూ. 1,27,700 గా ఉంది. దీనికి ముందు చూస్తే వరుసగా రెండు రోజుల్లో రూ. 250, రూ. 500 చొప్పున తగ్గాయి. 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ. 1310 పెరగ్గా 10 గ్రాములకు ఇప్పుడు రూ. 1,39,310 వద్ద ఉంది. ఇవాళ మరింత పెరగనున్నాయి. ఇక వెండి ధర కిందటి రోజు రూ. 5 వేలు తగ్గగా.. ఇవాళ రూ. 4 వేలు తగ్గింది. దీంతో ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కేజీ సిల్వర్ రేటు రూ. 2.68 లక్షల వద్ద ఉంది. ఉదయం 10 గంటల తర్వాత సిల్వర్ రేటు కూడా అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా భారీగా పెరగనుందని చెప్పొచ్చు.