Punjab : పంజాబ్‌లో రహదారులను దిగ్బంధించిన రైతులు
Punjab : బుధవారం లుథియానాలో జరిగిన సమావేశంలో ఎస్‌కెఎం నిరసనకు పిలుపునిచ్చింది. ఫజిల్కా, బతిండా, బర్నాలా, లుథియానా జిల్లాలతో పాటు మండీలకు సమీపంలోని జాతీయ రహదారులపై ఆందోళనలు చేపట్టాలని రైతులు నిర్ణయించారు.
- By Latha Suma Published Date - 04:54 PM, Fri - 25 October 24
Farmers : సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) నేతృత్వంలో రైతులు శుక్రవారం పంజాబ్ నుండి వెళ్లే రహదారులతో పాటు ప్రధాన జాతీయ రహదారులను నాలుగు గంటల పాటు దిగ్బంధించారు. సమస్యలను పరిష్కరించి రైతుల పంటలను త్వరగా కొనుగోలు చేయాలని గతవారం రైతులు పంజాబ్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై ప్రభుత్వం స్పందించకపోవడంతో బుధవారం లుథియానాలో జరిగిన సమావేశంలో ఎస్‌కెఎం నిరసనకు పిలుపునిచ్చింది. ఫజిల్కా, బతిండా, బర్నాలా, లుథియానా జిల్లాలతో పాటు మండీలకు సమీపంలోని జాతీయ రహదారులపై ఆందోళనలు చేపట్టాలని రైతులు నిర్ణయించారు.
గతవారం చండీగఢ్‌లో నిరసన ప్రదర్శన చేపట్టారు. అయితే అక్టోబర్ 19న ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సమావేశానికి పిలుపునివ్వడంతో నిరసనను నాలుగురోజుల పాటు వాయిదావేశారు. ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని రైతు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ వ్యక్తులకు సహాయం చేసేందుకు ధాన్యం సేకరణను ఆలస్యం చేస్తున్నారని మండిపడ్డారు.
ధాన్యం కొనుగోళ్లు, డిఎపి ఎరువుల కొరతపై ఆందోళనను ఉధృతం చేస్తామని ఎస్‌కెఎం, కిసాన్ మజ్దూర్ మోర్చా (కెఎంఎం) ప్రకటించాయి. శనివారం నుండి రాష్ట్రంలో నాలుగు ప్రాంతాల్లో ధర్నాలు చేపడతామని పేర్కొన్నాయి. మధ్యాహ్నం 1.00 గంట నుండి సంగ్రూర్, ఫగ్వారా, బటాలా, దగ్రు, సంగ్రూర్‌లోని బార్బర్‌కకాన్‌లలో ధర్నాలు నిర్వహిస్తామని, ట్రాఫిక్‌ను అడ్డుకుంటామని తెలిపాయి.