FASTag Annual Pass : ఫాస్టాగ్ యాన్యువల్ పాస్‌కు అద్భుత స్పందన ..తొలి రోజు లక్షల్లో వినియోగదారులు కొనుగోలు
కేవలం నిన్నటితో (ఆగస్టు 15) ప్రారంభమైన ఈ కొత్త విధానం, వినియోగదారుల్లో విశేష ఉత్సాహాన్ని రేకెత్తించింది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, మొదటి రోజు సాయంత్రం 7 గంటల వరకూ సుమారు 1.4 లక్షల మంది వినియోగదారులు ఈ పాస్‌ను సొంతం చేసుకున్నారు.
- By Latha Suma Published Date - 03:14 PM, Sat - 16 August 25

FASTag Annual Pass : జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ‘ఫాస్టాగ్ యాన్యువల్ పాస్’ సదుపాయానికి ప్రజల నుంచి అంచనాలకు మించి స్పందన లభించింది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ప్రకటించిన వివరాల ప్రకారం, ప్రారంభమైన తొలి రోజే లక్షలాది మంది ఈ వార్షిక పాస్‌ను కొనుగోలు చేసి యాక్టివేట్ చేసుకున్నారు. కేవలం నిన్నటితో (ఆగస్టు 15) ప్రారంభమైన ఈ కొత్త విధానం, వినియోగదారుల్లో విశేష ఉత్సాహాన్ని రేకెత్తించింది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, మొదటి రోజు సాయంత్రం 7 గంటల వరకూ సుమారు 1.4 లక్షల మంది వినియోగదారులు ఈ పాస్‌ను సొంతం చేసుకున్నారు. అదే సమయంలో, టోల్ ప్లాజాల వద్ద 1.39 లక్షలకు పైగా లావాదేవీలు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఉన్న 1,150 టోల్ ప్లాజాల వద్ద ఈ సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఏడాది పాటు టోల్ టెన్షన్‌కి గుడ్‌బై
ఈ పాస్‌ను పొందేందుకు వాహనదారులు రూ.3,000 ఒక్కసారిగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ చెల్లింపుతో వారు ఏకంగా 200 టోల్ ప్లాజాల దాకా ప్రయాణించవచ్చు లేదా ఒక సంవత్సరం వరకూ పాస్ చెల్లుబాటు అవుతుంది. ఏది ముందు పూర్తవుతుందో అది వర్తించనుంది. ఇది వాణిజ్యేతర (నాన్-కమర్షియల్) వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. ప్రతి టోల్ పాస్‌ను ‘రాజమార్గయాత్ర’ యాప్ ద్వారా లేదా NHAI అధికార వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయవచ్చు. వినియోగదారుడి సౌలభ్యం కోసం, పాస్ కొనుగోలు చేసిన రెండు గంటల లోపే యాక్టివేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.
వినియోగదారులకు పూర్తి మద్దతు
ఈ పాస్ అమలులో వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం తలెత్తకుండా ఉండేందుకు, ప్రతి టోల్ ప్లాజా వద్ద నోడల్ అధికారులను ప్రత్యేకంగా నియమించినట్లు NHAI తెలిపింది. ప్రయాణికులు ఎదుర్కొనే సాంకేతిక సమస్యలు, సమాచారం కొరత వంటి అంశాలను పరిష్కరించేందుకు ‘1033’ నేషనల్ హైవే హెల్ప్‌లైన్‌కి మరింత బలోపేతం చేశారు. అదనంగా, 100 మందికి పైగా సిబ్బందిని ఈ కార్యకలాపాల్లో భాగంగా చేర్చారు.
విస్తరిస్తున్న ఫాస్టాగ్ వినియోగం
ప్రస్తుతం దేశంలో ఫాస్టాగ్ వినియోగం 98 శాతం వరకు పెరిగిందని, 8 కోట్లకు పైగా వినియోగదారులు ఉన్నారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇది వాహనదారుల మధ్య డిజిటల్ చెల్లింపులపై పెరుగుతున్న అవగాహనకు నిదర్శనం. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ వార్షిక పాస్ సదుపాయంతో ప్రయాణం మరింత సురక్షితంగా, వేగవంతంగా, మరియు అనువుగా మారుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు. ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ సదుపాయం వాహనదారులకు పెద్ద ఉపశమనం కలిగించనుంది. పదేపదే రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేకుండా, ఏడాది పాటు నిరంతరంగా జాతీయ రహదారులపై ప్రయాణం చేయొచ్చన్న భరోసా ఈ పాస్‌తో వచ్చింది. దేశవ్యాప్తంగా ఈ పథకానికి లభించిన స్పందన చూస్తుంటే, భవిష్యత్తులో మరిన్ని ఆధునికీకరణలు వస్తాయని ఊహించవచ్చు.