Telangana Heavy Rains : భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉండడం తో అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
Telangana Heavy Rains : ఈ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్లు సీఎం వెల్లడించారు
- By Sudheer Published Date - 02:51 PM, Sat - 16 August 25

తెలంగాణలో భారీ వర్షాల (Telangana Heavy Rains) హెచ్చరికల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేశారు. శనివారం ఉదయం ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి, వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్లు సీఎం వెల్లడించారు.
వర్షాల ప్రభావం అధికంగా ఉండే ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను ముందుగానే మోహరించాలని సీఎం ఆదేశించారు. ఈ బృందాలు జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు, సహాయక శిబిరాలకు తరలించాలని దిశానిర్దేశం చేశారు. దీనివల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.
Jaggareddy : కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు.. పార్టీ అంతర్గత కలకలం రేపేలా వ్యాఖ్యలు
నీటిపారుదల శాఖ అధికారులు రిజర్వాయర్లు, చెరువులు, కుంటల నీటి మట్టాలను ఎప్పటికప్పుడు అంచనా వేయాలని సీఎం సూచించారు. నీటిని దిగువకు విడుదల చేయాల్సి వస్తే, ముందుగానే కలెక్టర్లు, క్షేత్రస్థాయి సిబ్బంది, ప్రజలకు సమాచారం అందించాలని చెప్పారు. అలాగే నిండిన చెరువులు, రిజర్వాయర్ల వద్ద ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచి అప్రమత్తంగా ఉండాలన్నారు. రహదారులపై వరద నీరు చేరితే, పోలీసులు, రెవెన్యూ అధికారులు రాకపోకలను నిలిపివేసి, బారికేడ్లు ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని ఆదేశించారు.
భారీ వర్షాల కారణంగా వర్షపు నీరు నిలిచిపోయి దోమలు, ఇతర కీటకాలు పెరిగి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని సీఎం హెచ్చరించారు. పట్టణాలు, గ్రామాల పారిశుద్ధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని సూచించారు. వైద్యారోగ్య శాఖ తగినన్ని మందులను అందుబాటులో ఉంచాలని, అవసరమైన చోట్ల వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ నగరంలో జీహెచ్‌ఎంసీ, హైడ్రా, ఎస్డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక శాఖ సిబ్బంది ప్రజల నుంచి వచ్చే వినతులను వెంటనే పరిష్కరించాలని కోరారు. ప్రాణ, ఆస్తి, పశు నష్టం జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు.