Rs 4650 Crore Seized : సరికొత్త రికార్డ్.. రూ.4,650 కోట్లు సీజ్ చేసిన ఈసీ
Rs 4650 Crore Seized : లోక్ సభ ఎన్నికల టైంలో నగదు, మద్యం, కానుకల ప్రవాహం జరుగుతుందనే విషయం అందరికీ తెలుసు.
- By Pasha Published Date - 03:14 PM, Mon - 15 April 24

Rs 4650 Crore Seized : లోక్ సభ ఎన్నికల టైంలో నగదు, మద్యం, కానుకల ప్రవాహం జరుగుతుందనే విషయం అందరికీ తెలుసు. ఈసారి పోలింగ్‌కు ముందే భారీగా నగదు ప్రవాహం జరిగింది. ఈ మాటకు పూర్తి ఆధారంగా నిలిచే కీలక ప్రకటన సాక్షాత్తూ కేంద్ర ఎన్నికల సంఘం చేసింది. 75 ఏళ్ల భారతదేశ లోక్‌సభ ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీగా నగదును స్వాధీనం చేసుకున్నామని వెల్లడించింది. లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు ముందు రికార్డు స్థాయిలో రూ. 4,650 కోట్లను(Rs 4650 Crore Seized) స్వాధీనం చేసుకున్నామని ఈసీ ప్రకటించింది.
We’re now on WhatsApp. Click to Join
2019 లోక్‌సభ ఎన్నికల టైంలో రూ.3,475 కోట్లను ఈసీ సీజ్ చేసింది. ఈసారి ఆ అమౌంట్ రూ. 4,650 కోట్లకు చేరింది. అంటే దాదాపు రూ.1000 కోట్లు అదనంగా ఈసారి కేంద్ర ఎన్నికల సంఘానికి దొరికాయి. ఈ ఏడాది మార్చి 1 నుంచి సగటున ప్రతిరోజూ రూ.100 కోట్లు చొప్పున ఈసీ సీజ్ చేసింది. ఎన్నికల సంఘానికి చెందిన ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, స్టాటిస్టిక్స్ సర్వైలెన్స్ టీమ్‌లు, వీడియో వ్యూయింగ్ టీమ్‌లు జరిపిన తనిఖీల్లో ఈ డబ్బంతా దొరికింది. ఎన్నికల వేళ తాయిలాలుగా నగదు, మద్యం, ఉచితాలు, డ్రగ్స్, మాదక ద్రవ్యాలను ప్రజలకు పంపిణీ చేయకుండా అడ్డుకునేందుకు ఈసీ నిత్యం కసరత్తు చేస్తోంది.
Also Read :Sri Ram Navami Remedies : శ్రీరామనవమి రోజు ఎరుపు దుస్తులు ధరిస్తే ఏమవుతుందో తెలుసా ?
తాజాగా శనివారం రాత్రి తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో ఏకంగా 1425 కేజీల బంగారు బిస్కెట్లను ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ స్వాధీనం చేసుకుంది. వీటి విలువ దాదాపు రూ.700 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాంచీపురం జిల్లాలో ఉన్న శ్రీపెరుంబుదూర్-కుండ్రత్తూర్ రహదారిలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ నిర్వహించిన తనిఖీల్లో ఈ బంగారు బిస్కెట్లు దొరికాయి.ఓ ప్రైవేటు సెక్యూరిటీ సంస్థకు చెందిన మినీ లారీ, మినీ కంటెయినర్ లారీలను అధికారులు చెక్ చేయగా అవాక్కయ్యారు. ఓ వాహనంలో 1000 కిలోల గోల్డ్ బిస్కెట్లు, మరో వాహనంలో 400 కిలోల గోల్డ్ బిస్కెట్లు ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఈ బంగారాన్ని చెన్నై విమానాశ్రయం నుంచి శ్రీపెరుంబుదూర్ సమీపంలోని మన్నూర్‌లో ఉన్న ఓ గోదాముకు(1400 KG Gold Seized) తరలిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. మొత్తం బంగారంలో 400 కిలోలకు మాత్రమే ఆధారాలు ఉన్నాయి. మిగతా 1000 కేజీల గోల్డ్‌కు సరైన డాక్యుమెంట్స్ లేవు. దీంతో వెంటనే ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు.. చెన్నై విమానాశ్రయ కస్టమ్స్ అధికారులకు సమాచారాన్ని చేరవేశారు. ఆదాయపు పన్ను శాఖ అధికారులకు కూడా దీనిపై సమాచారం అందించారు.