Jharkhand : జార్ఖండ్ ఎన్నికలు.. కాంగ్రెస్ విజయం ఖాయం: భట్టి విక్రమార్క
Jharkhand : కాంగ్రెస్ పార్టీ జార్ఖండ్ పురోగతి కోసం వ్యూహరచన చేస్తుందని చెప్పారు. కూటమి ఎన్నికల హామీలు, కార్యక్రమాల గురించి చర్చించడంతో పాటు చేపట్టల్సిన కార్యక్రమాలను నిర్ధేశించుకున్నామని ఆయన తెలిపారు.
- By Latha Suma Published Date - 07:40 PM, Fri - 1 November 24

Deputy CM Bhatti Vikramarka : జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 13, 20 తేదీల్లో ఆ రాష్ట్రానికి ఎన్నికలు జరగనున్నాయి. అయితే జార్ఖండ్ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్లలో ఒకరైన కాంగ్రెస్ సీనియర్ నేత, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆ రాష్ట్ర పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు. పలు ప్రచార కార్యక్రమాలు, పార్టీ కీలక సమావేశాల్లో పాల్గొంటున్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి వ్యూహం.. విడుదల చేయాల్సిన మేనిఫెస్టో పై శుక్రవారం సాయంత్రం రాంచీలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, ఎన్నికల ఇంచార్జ్ భట్టి విక్రమార్క, జార్ఖండ్ పీసీసీ అధ్యక్షుడు కేశవ్ మహతో కమలేష్‌తో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు గులాం అహమద్ మీర్ సాబ్, గౌరవ్ , బి కే హరిప్రసాద్, ఎలక్షన్ ఇన్చార్జి రామేశ్వర రావు తదితరులు మేనిఫెస్టోలో పొందుపర్చాల్సిన అంశాలపై కీలక చర్చలు జరిపారు. ఈ జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటక, తెలంగాణ ఎన్నికల ఫలితాలు రిపీట్ అయ్యేలా కాంగ్రెస్ కూటమి వ్యూహాలు రచిస్తోంది.
ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ జార్ఖండ్ పురోగతి కోసం వ్యూహరచన చేస్తుందని చెప్పారు. కూటమి ఎన్నికల హామీలు, కార్యక్రమాల గురించి చర్చించడంతో పాటు చేపట్టల్సిన కార్యక్రమాలను నిర్ధేశించుకున్నామని ఆయన తెలిపారు. కార్యకర్తలంతా సమన్వయంగా పనిచేస్తే మనం జార్ఖండ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. దేశాన్ని రక్షించడం కోసం, రాజ్యాంగ మౌళిక సూత్రాలను కాపాడడంతో పాటు దేశ వనరులను కాపాడుకోవాలంటే ఇండియా కూటమికి ఓటు వేసి కూటమి అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరముందన్నారు. ప్రస్తుత బీజేపీ పాలనలో సంపన్న పెట్టుబడి దారులు ఈ దేశాన్ని దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. బీజేపీ పాలనలో దేశం నానాటికి వెనక్కి వెళుతుందని విమర్శించారు. దళిత, బలహీన వర్గాలు, మైనార్టీలు సహా అన్ని వర్గాల సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. మరోవైపు మహారాష్ట్రలో నవంబర్ 20వ తేదీన సింగిల్ ఫేజ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల జరిగిన హర్యానా, జమ్ము కాశ్మీర్ అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే.
Read Also: Diwali : కళాకారులతో రాహుల్ గాంధీ దీపావళి వేడుకలు