Indian Cricket Team: టీమిండియాపై ప్రశంసల జల్లు.. గర్వంగా ఉందన్న ప్రధాని మోదీ!
- By Gopichand Published Date - 08:26 AM, Sun - 30 June 24

Indian Cricket Team: బార్బడోస్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు (Indian Cricket Team) 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది. భారత జట్టు సాధించిన ఈ విజయంతో దేశ వ్యాప్తంగా సంబరాల వాతావరణం నెలకొంది. సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రముఖ రాజకీయ ప్రముఖులు టీమ్‌కు అభినందనలు తెలిపారు. మరోవైపు టీమ్ ఇండియా సాధించిన ఈ విజయంపై క్రీడా, సినీ ప్రముఖులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
భారత్ జట్టును చూసి గర్విస్తున్నాం: ప్రధాని మోదీ
టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన టీమిండియాపై ప్రధాని ప్రశంసల జల్లు కురిపించారు. టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత టీమిండియాపై ప్రధాన మోదీ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. భారత్ జట్టును చూసి గర్విస్తున్నామని పేర్కొన్నారు. టీ20 ప్రపంచకప్‌ను రెండో సారి గెలవడం పట్ల ప్రధాని మోదీ ఆనందం వ్యక్తం చేశారు. ఈ మ్యాచ్ ఒక చరిత్ర అని పేర్కొన్నారు.
భారత్ జట్టుకు హృదయపూర్వక అభినందనలు: రాష్ట్రపతి
టీమిండియా టీ20 ప్రపంచ కప్ గెలుపుతో రాష్ట్రప్రతి ద్రౌపదీ ముర్ము జట్టుపై ప్రశంసల జల్లు కురిపించారు. క్లిష్ట పరిస్థితుల్లో భారత జట్టు అత్యుత్తమ నైపుణ్యాలను ప్రదర్శించిందని కొనియాడారు. టీమిండియాను చూసి గర్వపడుతున్నాం. భారత్ జట్టుకు హృదయపూర్వక అభినందనలు అని రాష్ట్రపతి పేర్కొన్నారు.
Also Read: Virat- Rohit Retirement: టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్లు రోహిత్, విరాట్..!
భారత్‌కు అభినందనలు: రాహుల్ గాంధీ
టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన టీమిండియాపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశంసలు కురిపించారు. రోహిత్.. ఈ విజయం మీ నాయకత్వానికి నిదర్శనమని ఆయన తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. నీలి రంగులో ఉన్న అద్భుతమైన ఆటగాళ్లు దేశం గర్వపడేలా చేశారని కొనియాడారు. ప్రపంచ కప్ విజయం, టోర్నమెంట్ అంతటా అద్భుత ప్రదర్శన చేసినందుకు టీమిండియాకు అభినందనలు అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
We’re now on WhatsApp : Click to Join
టీమిండియాకు అభినందనలు తెలిపిన సీఎం రేవంత్
విజయం సాధించిన టీమిండియాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై అద్భుత విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఐసీసీ టీ-20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకోవడం ద్వారా భారత్ జట్టు దేశానికి కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టిందని, క్రికెట్ ప్రపంచంలో మళ్లీ భారత్‌కు ఎదురులేదని నిరూపించడం గర్వకారణమని సీఎం అన్నారు.
విశ్వ విజేతలకు అభినందనలు: డిప్యూటీ సీఎం పవన్
రెండవ సారి టీ20 ప్రపంచకప్ గెలుచుకుని విశ్వ విజేతగా నిలిచిన భారత జట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. 140కోట్ల భారతీయుల ఆకాంక్షలను నిలబెడుతూ రోహిత్ సేన సాధించిన విజయం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్‌లో జట్టు మొత్తం సమిష్టిగా రాణించిన తీరు అద్భుతమని కొనియాడారు. భారత క్రికెటర్లకు పేరుపేరునా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు.