బంగ్లాదేశ్‌కు ప్రధాని మోదీ?!
ఎన్నికల విజయం తర్వాత తారిఖ్ రెహ్మాన్ మాట్లాడుతూ.. "మా ప్రభుత్వం ఇప్పుడు దేశవ్యాప్తంగా పటిష్టమైన భద్రతా వ్యవస్థను, శాంతిభద్రతలను ఏర్పాటు చేస్తుంది" అని ప్రకటించారు.
- Author : Gopichand
Date : 14-02-2026 - 9:58 IST
Published By : Hashtagu Telugu Desk
PM Modi: బంగ్లాదేశ్ ఎన్నికల్లో బిఎన్‌పి భారీ మెజారిటీ సాధించిన తర్వాత, ఆ పార్టీ అధ్యక్షుడు తారిఖ్ రెహ్మాన్ దేశ తదుపరి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విజయం అనంతరం తారిఖ్ రెహ్మాన్ పొరుగు దేశాలతో సంబంధాలను సరికొత్తగా ప్రారంభించాలని ఉద్ఘాటించారు. ఈ క్రమంలో తారిఖ్ రెహ్మాన్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించాలనే డిమాండ్ బిఎన్‌పి పార్టీ లోపల వినిపిస్తోంది.
ప్రధాని మోదీని బంగ్లాదేశ్‌కు ఆహ్వానించాలనే డిమాండ్
వచ్చే ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తారని ఆశిస్తున్నట్లు బిఎన్‌పి నాయకుడు ఏఎన్ఎం ఎహ్సానుల్ హక్ మిలన్ శనివారం (14 ఫిబ్రవరి 2026) ఆశాభావం వ్యక్తం చేశారు. తారిఖ్ రెహ్మాన్ పట్టాభిషేకానికి దక్షిణాసియా నాయకులను ఆహ్వానించడంపై స్పందిస్తూ.. “దక్షిణాసియాలోని నాయకులందరినీ ఆహ్వానిస్తారని నేను నమ్ముతున్నాను. భారత ప్రధాని నరేంద్ర మోదీని ఖచ్చితంగా ఆహ్వానించాలి. ఇది కనీస మర్యాద. ప్రపంచం మొత్తం మాతో ఉంటుందని నేను ఆశిస్తున్నాను” అని ఆయన అన్నారు.
Also Read: రేపట్నుంచి ఈ రాశులవారికి ధన లాభంతో పాటు ఉద్యోగ అవకాశాలు!
షేక్ హసీనా అప్పగింతపై తారిఖ్ రెహ్మాన్ స్పందన
బిఎన్‌పి నాయకుడు ఎహ్సానుల్ హక్ విదేశాంగ విధానం గురించి ప్రస్తావిస్తూ “అందరితో స్నేహం, ఎవరితోనూ శతృత్వం లేదు” అని వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్‌లో ఏ ధరకైనా శాంతిభద్రతలను కాపాడతామని తారిఖ్ రెహ్మాన్ స్పష్టం చేశారు. బంగ్లాదేశ్ విదేశాంగ విధానం అక్కడి ప్రజల ప్రయోజనాల ఆధారంగానే నిర్ణయించబడుతుందని ఆయన అన్నారు. భారత దేశం నుండి షేక్ హసీనాను అప్పగించాలనే డిమాండ్‌పై స్పందిస్తూ “ఇది పూర్తిగా చట్టపరమైన ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది” అని ఆయన తెలిపారు.
శాంతిభద్రతల బలోపేతంపై దృష్టి
ఎన్నికల విజయం తర్వాత తారిఖ్ రెహ్మాన్ మాట్లాడుతూ.. “మా ప్రభుత్వం ఇప్పుడు దేశవ్యాప్తంగా పటిష్టమైన భద్రతా వ్యవస్థను, శాంతిభద్రతలను ఏర్పాటు చేస్తుంది” అని ప్రకటించారు. అలాగే అధికార జవాబుదారీతనంపై ఆయన భరోసా ఇచ్చారు. “దేశంలో ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా ప్రజలకు జవాబుదారీగా ఉండే పార్లమెంటు, ప్రభుత్వం మళ్లీ ఏర్పడుతున్నాయి. మరే ఇతర దుష్ట శక్తి దేశంలో నియంతృత్వాన్ని తీసుకురాకుండా చూసేందుకు, దేశం బానిసత్వంలోకి వెళ్లకుండా ఉండేందుకు మనమందరం ఐక్యంగా ఉండాలి. ప్రజల ఇష్టాన్ని గౌరవించాలి” అని ఆయన పేర్కొన్నారు.