Diabetes: భారత్‌లో 73 శాతం మందికి షుగర్ వచ్చే ఛాన్స్!
దీర్ఘకాలిక వ్యాధులపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN)
- By Maheswara Rao Nadella Published Date - 11:40 AM, Mon - 13 February 23

దీర్ఘకాలిక వ్యాధులపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) సంయుక్తంగా జరిపిన తాజా సర్వేలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అధిక బరువు, ఊబకాయం వల్ల భారతీయులు మధుమేహం (Diabetes) బారినపడే ప్రమాదం 73 శాతంగా ఉన్నట్టు సర్వే తేల్చింది. దేశవ్యాప్తంగా 600 ప్రాంతాల్లో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 10,659 మందిని ఐసీఎమ్ఆర్, ఎన్ఐఎన్ సర్వే చేశాయి. ఇక దేశంలో దీర్ఘకాలిక వ్యాధులపై జరిగిన తొలి సర్వే ఇదేనని కేంద్రం ప్రకటించింది.
సర్వే వివరాల ప్రకారం.. పట్టణాల్లో 34 శాతం మంది రక్తపోటుతో బాధపడుతున్నారు. రక్తపోటు బాధితుల్లో పురుషుల సంఖ్యే అధికం. 2019 లో దీర్ఘకాలిక వ్యాధులతో 61 లక్షల మంది మరణించినట్టు సర్వేలో తేలింది. వీరిలో షుగర్ (Diabetes) కారణంగా మరణించిన వారి సంఖ్య 1.70 లక్షలు. అంతేకాకుండా.. దేశంలో 65 శాతం మరణాలకు దీర్ఘకాలిక వ్యాధులే కారణమని బయటపడింది.
దేశంలో పోషకాహారలోపం కూడా ఉన్నట్టు సర్వే తేల్చింది. 98.4 శాతం మంది సరిపడా కూరగాయలు, పండ్లు తినడంలేదట. ఇదిగాక..సర్వేలో పాల్గొన్న 41 శాతం మంది తాము శారీరక శ్రమ చేయట్లేదని పేర్కొన్నారు. దీంతో.. 2040 నాటికి దేశంలో ఊబకాయుల సంఖ్య మూడింతలయ్యే ప్రమాదం ఉందని ఐసీఎమ్ఆర్, ఎన్ఐఎస్ హెచ్చరించాయి. ఇక దేశంలో ధూమపానం అలవాటు ఉన్న వారు 32.8 శాతం కాగా.. మద్యపానానికి అలవాటు పడ్డ వారి సంఖ్య 15.9 శాతంగా ఉన్నట్టు సర్వేలో తేలింది.
Also Read: Mrityunjaya Mantra: తారకరత్న చెవిలో బాలకృష్ణ మృత్యుంజయ మంత్రం!