Heat Waves: భారత్ లో తీవ్రమైన వడగాలులు.. హెచ్చరించిన వరల్డ్ బ్యాంక్
- Author : Gopichand
Date : 08-12-2022 - 6:35 IST
Published By : Hashtagu Telugu Desk
భారత్ లో జనాభాతో పాటు ఉష్ణోగ్రత(Heat Waves)లు తీవ్రంగా పెరుగుతాయని ప్రపంచ బ్యాంకు (World Bank) నివేదిక వెల్లడించింది. త్వరలో మనిషి మనుగడ పరిమితిని మించి వడగాల్పులు వీచే ప్రపంచంలోనే మొదటి దేశంగా భారత్ మారొచ్చని హెచ్చరించింది. ‘భారత శీతలీకరణ రంగంలో వాతావరణ పెట్టుబడుల అవకాశాలు’ పేరుతో వరల్డ్ బ్యాంక్ ఈ నివేదిక రూపొందించింది. భారత కార్మికులపై తీవ్ర ఉష్ణోగ్రతల ప్రభావం ఉంటుందని పేర్కొంది. భారత్ ముందస్తు అధిక ఉష్ణోగ్రతల(Heat Waves)ను ఎదుర్కొంటోందని.. ఇది చాలా కాలం ఉంటుందని నివేదికలో అంచనా వేసింది.
కేరళ ప్రభుత్వంతో కలిసి ప్రపంచ బ్యాంకు నిర్వహిస్తున్న రెండు రోజుల ‘ఇండియా క్లైమేట్ అండ్ డెవలప్‌మెంట్ పార్టనర్స్ మీట్’ సందర్భంగా ఈ నివేదికను విడుదల చేయనున్నారు. భారత్‌లో వడగాల్పులు పరిస్థితి మానవ మనుగడ పరిమితిని విచ్ఛిన్నం చేయగలదని అంచనా వేసిన ప్రపంచ బ్యాంకు.. దక్షిణాసియా అంతటా పెరుగుతున్న ఉష్ణోగ్రతల గురించి అనేక మంది వాతావరణ శాస్త్రవేత్తలు చాలా కాలంగా హెచ్చరించిన దానికి ఇటీవల పరిస్థితులు మద్దతు ఇస్తాయని పేర్కొంది.
‘‘ఆగస్టు 2021లో వాతావరణ మార్పులపై ఇంటర్-గవర్నమెంటల్ ప్యానెల్ (IPCC) ఆరో నివేదిక రాబోయే దశాబ్దంలో భారత ఉపఖండం మరింత తీవ్రమైన వేడి గాలులను ఎదుర్కొంటుందని చెప్పింది.. IPCC అంచనా ప్రకారం కార్బన్ ఉద్గారాలు ఎక్కువగా ఉంటే 2036-65 నాటికి భారత్ అంతటా వేడి గాలులు 25 రెట్లు ఎక్కువ ఉండే అవకాశం ఉందని G20 క్లైమేట్ రిస్క్ అట్లాస్ 2021లో హెచ్చరించింది’’ అని నివేదిక పేర్కొంది.
Also Read: EPFO: ఈపీఎఫ్ ఖాతాదారులకు పదే పదే క్లెయిమ్ తిరస్కరణలకు చెక్..!
భారత్ అంతటా పెరుగుతున్న వేడి ఆర్థిక ఉత్పాదకతను దెబ్బతీస్తుందని కూడా నివేదిక హెచ్చరించింది. ‘‘భారతదేశంలోని శ్రామికశక్తిలో 75 శాతం లేదా 380 మిలియన్ల మంది ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే కార్మికులు.. కొన్నిసార్లు ప్రాణాంతక ఉష్ణోగ్రతలలో పని చేస్తున్నారు. 2030 నాటికి 80 మిలియన్ల ప్రపంచ కార్మికులలో భారత్‌కు చెందిన 34 మిలియన్లను మంది ఉష్ణ ఒత్తిడితో సంబంధం ఉన్న ఉత్పాదకత క్షీణతతో నష్టపోతారని అంచనా’’ అని నివేదిక పేర్కొంది.
దక్షిణాసియా దేశాలలో భారత్ కార్మికులపై అత్యధిక ఉష్ణోగ్రత ప్రభావం చూపిందని, సంవత్సరానికి 101 బిలియన్ గంటల కంటే ఎక్కువ నష్టం వాటిల్లిందని పేర్కొంది. గ్లోబల్ మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ మెకిన్‌సే అండ్ కంపెనీ విశ్లేషణ ప్రకారం.. పెరుగుతున్న వేడి, తేమ కారణంగా కోల్పోయిన కార్మికులు ఈ దశాబ్దం చివరినాటికి భారతదేశ జీడీపీలో 4.5 శాతం.. సుమారు 150-250 బిలియన్ అమెరికా డాలర్లు ప్రమాదంలో పడొచ్చు. భారత్ దీర్ఘకాలిక ఆహార, ప్రజారోగ్య భద్రత నమ్మకమైన కోల్డ్ చైన్ నెట్‌వర్క్‌పై ఆధారపడి ఉంటుందని పేర్కొంది.