Indian Migrants : భారత్ చేరుకున్న 205 మంది వలసదారులు..
వీరంతా పంజాబ్, దాని చుట్టుపక్కల రాష్ట్రాలకు చెందినవారిగా తెలుస్తోంది. అయితే, వీరిని అదుపులోకి తీసుకునేందుకు స్వదేశంలో ఎలాంటి ఆదేశాలు లేవని సమాచారం.
- By Latha Suma Published Date - 03:49 PM, Wed - 5 February 25
Indian Migrants : అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న 205 మంది భారతీయులతో కూడిన విమానం భారత్‌కు చేరుకుంది. టెక్సాస్ నుంచి బయల్దేరిన అమెరికా మిలటరీకి చెందిన సీ-17 విమానం ఈరోజు మధ్యాహ్నం అమృత్‌సర్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది. వీరంతా పంజాబ్, దాని చుట్టుపక్కల రాష్ట్రాలకు చెందినవారిగా తెలుస్తోంది. అయితే, వీరిని అదుపులోకి తీసుకునేందుకు స్వదేశంలో ఎలాంటి ఆదేశాలు లేవని సమాచారం. అవసరమైన తనిఖీల అనంతరం ఎయిర్‌పోర్టు నుంచి బయటకు పంపించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
Read Also: Delhi assembly elections : ఒంటిగంట వరకు 33.31శాతం పోలింగ్
వెనక్కి పంపేముందు ప్రతిఒక్కరి రికార్డులను పరిశీలించినట్లు ఢిల్లీలోని అమెరికా ఎంబసీ అధికారులు వెల్లడించారు. రానున్న రోజుల్లో మరిన్ని విమానాలు అమెరికా నుంచి భారత్‌కు రానున్నాయని వివరించారు. యూఎస్ హోంలాండ్ అధికారుల గణాంకాల ప్రకారం 20,407 మంది ఇండియన్స్ వద్ద సరైన ధ్రువపత్రాలు లేనట్లు తేలింది. వీరిలో 17,940 మందిని వెనక్కి పంపేందుకు తుది ఉత్తర్వులు జారీ చేశారు. 2,467 మంది ఈఆర్ఓ (ఎన్‌ఫోర్స్‌మెంట్ రిమూవల్ ఆపరేషన్స్) నిర్బంధంలో ఉన్నారు. మొదటి విడతలో భాగంగా 205 మందిని వెనక్కి పంపించారు.
కాగా, అమెరికాలో మొత్తం 1.10 కోట్ల మంది అక్రమ వలసదారులు ఉండగా, అందులో సరైన పత్రాలు లేని భారతీయులు ఏడున్నర లక్షల మంది వరకు ఉన్నట్టు అంచనా. ఇక, అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్.. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగానే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. వారిని అమెరికా నుంచి స్వదేశాలకు సాగనంపుతున్నారు.