Rs 10 Coins : రూ.10, రూ.20 నాణేలు, నోట్లపై అప్‌డేట్.. రూ.350 నోట్ వస్తుందా ?
‘‘రూ.10, రూ.20 నాణేలు, నోట్లను(Rs 10 Coins) ఇక రద్దు చేయబోతున్నారు’’ అంటూ కొన్ని పోస్ట్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
- By Pasha Published Date - 03:42 PM, Wed - 5 February 25

Rs 10 Coins : గత కొన్ని వారాల వ్యవధిలో సోషల్ మీడియా వేదికగా కరెన్సీపై రకరకాల వదంతుల ప్రచారం జరిగింది. రూ.10, రూ.20 నాణేలపై, రూ.500 కరెన్సీ నోట్లపై పలువురు తప్పుడు ప్రచారం చేశారు. ఇంకొందరు ఏకంగా రూ.350 కరెన్సీ నోట్లు రాబోతున్నాయంటూ పోస్ట్‌లు పెట్టారు. కొందరైతే ఇవన్నీ నిజమేనని నమ్మారు. ఇలాంటి వదంతులకు చెక్ పెట్టేందుకు స్వయంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రంగంలోకి దిగింది. ఈ అంశాలపై స్పష్టమైన క్లారిటీ ఇచ్చింది.
Also Read :Fetus In Fetu : తల్లి గర్భంలోని బిడ్డ కడుపులోనూ పసికందు
రూ.10, రూ.20 నాణేలు, నోట్లపై ..
‘‘రూ.10, రూ.20 నాణేలు, నోట్లను(Rs 10 Coins) ఇక రద్దు చేయబోతున్నారు’’ అంటూ కొన్ని పోస్ట్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ప్రచారాన్ని ఆర్‌బీఐ ఖండించింది. రూ.10, రూ.20 నాణేలు, నోట్లను రద్దు చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఒకవేళ అవసరమైతే అదనంగా మరిన్ని రూ.10, రూ.20 నాణేలు, నోట్లను ముద్రణ చేయించి ఆర్థిక వ్యవస్థలోకి విడుదల చేస్తామని వెల్లడించింది. రూ.20 కరెన్సీ నోట్ల ముద్రణను ఆపేశారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవికత లేనే లేదని ఆర్‌బీఐ పేర్కొంది. రూ.10 నాణెం తరహాలో రూ.20 నాణెం డిజైన్‌ను మార్చి, కొత్త రూ.20 నాణేలను విడుదల చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం.. ఇలాంటి అంశాలపై ఎవరు పడితే వారు ప్రచారం చేస్తే నమ్మొద్దని ప్రజలను కోరింది. ప్రభుత్వం, ఆర్‌బీఐ నుంచి విడుదలయ్యే అధికారిక ప్రకటనలను మాత్రమే విశ్వసించాలని సూచించింది. ఇక రూ.350 కరెన్సీ నోట్ అనేది విడుదల చేయడం లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అదంతా తప్పుడు ప్రచారమని స్పష్టం చేశాయి.
Also Read :311 Traffic Violations: ఒక్క వ్యక్తి.. 311 ట్రాఫిక్ ఉల్లంఘనలు.. రూ.1.61 లక్షల ఫైన్ వసూల్
రూ.20 నాణెం గురించి..
కేంద్ర ప్రభుత్వం 2020లో తొలిసారిగా రూ. 20 నాణేలను విడుదల చేసింది. రూ.20 నాణెం 12 భుజాల బహుభుజిగా ఉంటుంది. దానిపై ధాన్యం ఆకారం ఉంటుంది. భారతదేశంలో వ్యవసాయ రంగానికి ఉన్న ప్రాముఖ్యతను ఈ సింబల్ సూచిస్తుంది.
రూ.10 నాణెం గురించి..
తొలిసారిగా రూ.10 నాణేలను 2005 సంవత్సరంలో విడుదల చేశారు. వాటి వ్యాసం 27 మిల్లీమీటర్లు. వాటి ఎగువ భాగంలో “भारत”, “INDIA” అని రాసి ఉండేది. మూడు సింహాలతో కూడిన సత్యమేవ జయతే నినాదం హిందీలో నాణెపు దిగువ భాగంలో ఎడమ వైపున ఉండేవి. దాని కిందే నాణేన్ని ముద్రించిన సంవత్సరం ఉండేది. కాయిన్ వెనుక భాగంలో ఒక శరీరానికి నాలుగు తలలు ఉన్న ప్రతిమ ఉండేది. అక్కడే “दस रुपये”, “TEN RUPEES” అని రింగు అవతలి వైపున రాసి ఉండేది.