Non-veg Food: శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినకూడదా? కారణాలీవే?!
ఇకపోతే 2025లో శ్రావణ మాసం జూలై 25 శుక్రవారం నుంచి ప్రారంభమై ఆగస్టు 23వ తేదీతో ముగుస్తుంది. తెలుగు మాసాల్లో ఇది ఐదవ మాసం. ఈ మాసం వర్షరుతువుతో ప్రారంభమవుతుంది. ప్రకృతిలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపుతుంది.
- By Gopichand Published Date - 10:00 PM, Thu - 24 July 25

Non-veg Food: శ్రావణ మాసం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది పండుగలకు, వ్రతాలకు, పూజలకు, శుభకార్యాలకు ఎంతో అనువైన మాసం అని ప్రజల గాఢమైన నమ్మకం. ఇకపోతే 2025లో శ్రావణ మాసం జూలై 25 శుక్రవారం నుంచి ప్రారంభమై ఆగస్టు 23వ తేదీతో ముగుస్తుంది. తెలుగు మాసాల్లో ఇది ఐదవ మాసం. ఈ మాసం వర్షరుతువుతో ప్రారంభమవుతుంది. ప్రకృతిలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపుతుంది. ఈ నెలలో శివ కేశవులను నిష్టతో, భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. వరలక్ష్మీ వ్రతం, మంగళ గౌరీ వ్రతం, నాగ పంచమి, శ్రీకృష్ణాష్టమి, రాఖీ పౌర్ణమి వంటి అనేక ముఖ్యమైన పండుగలు ఈ మాసంలోనే వస్తాయి.
శ్రావణ మాసంలో నాన్ వెజ్ ఎందుకు తినకూడదు?
శ్రావణ మాసంలో మాంసాహారాన్ని (Non-veg Food) తినకపోవడం వెనుక మతపరమైన నమ్మకాలతో పాటు కొన్ని శాస్త్రీయ, ఆరోగ్యపరమైన కారణాలు కూడా ఉన్నాయి.
బలహీనమైన జీర్ణవ్యవస్థ
శ్రావణ మాసం వర్షాకాలంలో వస్తుంది. ఈ సమయంలో వాతావరణం తేమగా ఉంటుంది. సూర్యరశ్మి తక్కువగా ఉంటుంది. దీనివల్ల మన జీర్ణవ్యవస్థ బలహీనపడుతుంది. రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది. మాంసాహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఈ సమయంలో మాంసం తినడం వల్ల అజీర్తి, కడుపు నొప్పి, గ్యాస్, వాంతులు-విరేచనాలు వంటి జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువ.
వ్యాధుల ప్రమాదం
వర్షాకాలంలో నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు, బ్యాక్టీరియా, వైరస్లు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి. జంతువులకు కూడా ఈ సమయంలో రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాధిగ్రస్తమైన మాంసాన్ని తినడం వల్ల మానవులకు కూడా అనారోగ్యం కలిగే ప్రమాదం ఉంది.
ఆయుర్వేదం ప్రకారం
ఆయుర్వేద శాస్త్రం ప్రకారం.. శ్రావణంలో వాతావరణ మార్పుల వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. అటువంటి సమయంలో మాంసాహారం, మసాలా ఆహారాలు తీసుకోవడం వల్ల వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తారు. అందుకే ఈ సమయంలో తేలికగా జీర్ణమయ్యే సాత్విక ఆహారం (శాకాహారం) తీసుకోవాలని సూచిస్తారు.
Also Read: Asia Cup: ఆసియా కప్ చరిత్ర ఇదే.. 1984లో ప్రారంభం!
మతపరమైన/ఆధ్యాత్మిక కారణాలు
పవిత్రత: శ్రావణ మాసం ఆధ్యాత్మికంగా చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ నెలలో అనేక వ్రతాలు, పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో సాత్వికతను పాటించడం వల్ల మనస్సు శుద్ధి అవుతుందని, దైవారాధనకు మరింత అనుకూలంగా ఉంటుందని నమ్ముతారు. మాంసాహారం తమోగుణాన్ని పెంపొందిస్తుందని, ఇది ఆధ్యాత్మిక సాధనలో ఆటంకంగా మారుతుందని నమ్మకం.
సంతానోత్పత్తి: వర్షాకాలం జంతువులు, ముఖ్యంగా చేపలు, ఇతర జలచరాలకు సంతానోత్పత్తి సమయం. ఈ సమయంలో వాటిని వధించడం పర్యావరణ సమతుల్యతకు, జీవన చక్రానికి విరుద్ధమని భావిస్తారు.
అహింస: హిందూ సంస్కృతిలో అహింసకు ప్రాధాన్యత ఇస్తారు. శ్రావణ మాసం దైవత్వానికి, పవిత్రతకు అంకితం చేయబడిన నెల కాబట్టి ఈ సమయంలో జీవహింసకు దూరంగా ఉండాలని చాలా మంది భావిస్తారు.