Breakfast Items: కిడ్నీలకు హానికరమైన అల్పాహారాలు ఇవే.. ఈ లిస్ట్‌లో ఏమున్నాయంటే?
ఈ రోజుల్లో మార్కెట్‌లో స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, మ్యాంగో వంటి వివిధ రుచులలో ఫ్లేవర్డ్ యోగర్ట్స్ దొరుకుతున్నాయి. అయితే ఈ ఫ్లేవర్డ్ యోగర్ట్స్‌లో చక్కెర, కృత్రిమ రుచులు, ఫాస్ఫేట్ ఎక్కువగా ఉంటాయి.
- By Gopichand Published Date - 06:50 AM, Fri - 19 September 25

Breakfast Items: పొద్దున చేసే అల్పాహారం (Breakfast Items) మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కానీ అది సరైనది కాకపోతే అనారోగ్యం పాలవుతాం. అందుకే ఉదయం చేసే అల్పాహారం సరైనదిగా ఉండటం చాలా ముఖ్యం. ఉదయం పూట తినే కొన్ని ఆహార పదార్థాలు కిడ్నీలకు హానికరంగా మారవచ్చు. కిడ్నీలు శరీరంలోని మురికిని శుద్ధి చేసి బయటికి పంపే ఫిల్టర్ యంత్రంలా పనిచేస్తాయి. ఇవి శరీరంలో ద్రవాలు, ఎలక్ట్రోలైట్ స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. అయితే ఆహారపు అలవాట్లు సరిగా లేకపోతే ఈ ముఖ్యమైన అవయవం దెబ్బతినే ప్రమాదం పెరుగుతుంది. కిడ్నీల ఆరోగ్యాన్ని పాడుచేసే అల్పాహారంలో ఎప్పుడూ తినకూడని మూడు పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కిడ్నీలకు హానికరమైన అల్పాహారాలీవే
చక్కెరతో కూడిన సీరియల్స్
చాలామంది ఉదయాన్నే తీపి సీరియల్స్‌ను తింటారు. ఈ సీరియల్ ప్యాకెట్లపై ‘షుగర్ ఫ్రీ’, ‘తక్కువ క్యాలరీలు’, ‘ఆరోగ్యానికి మంచిది’ అని రాసి ఉన్నప్పటికీ అవి నిజంగా ఆరోగ్యకరమైనవి కాకపోవచ్చు. చక్కెరతో కూడిన సీరియల్స్ స్థూలకాయం, ఇన్సులిన్ నిరోధకతను పెంచుతాయి. ఈ రెండూ కిడ్నీల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. వీటికి బదులుగా ఉదయం అల్పాహారంలో ఓట్‌మీల్, బ్రాన్ ఫ్లేక్స్ లేదా మ్యూస్లీ వంటివి తినడానికి ప్రయత్నించండి. వీటి ద్వారా శరీరానికి ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి.
బయట కొనుగోలు చేసిన శాండ్‌విచ్‌లు
శాండ్‌విచ్‌ను ఇంట్లో తయారు చేసుకుంటే అది ఆరోగ్యకరమైన అల్పాహారం అవుతుంది. కానీ బయట కొనుగోలు చేసే శాండ్‌విచ్‌లలో ప్రాసెస్ చేసిన పదార్థాలు, ప్రిజర్వేటివ్‌లు, అధిక సోడియం, అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌కి దారితీసి కిడ్నీల పనితీరును దెబ్బతీస్తాయి. అందుకే ఇలాంటి శాండ్‌విచ్‌లను రోజూ తినకుండా అప్పుడప్పుడు మాత్రమే తినాలి.
Also Read: Zaheer Khan: లక్నో సూపర్ జెయింట్స్ జట్టును వీడనున్న జహీర్ ఖాన్?!
ఫ్లేవర్డ్ యోగర్ట్స్
ఈ రోజుల్లో మార్కెట్‌లో స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, మ్యాంగో వంటి వివిధ రుచులలో ఫ్లేవర్డ్ యోగర్ట్స్ దొరుకుతున్నాయి. అయితే ఈ ఫ్లేవర్డ్ యోగర్ట్స్‌లో చక్కెర, కృత్రిమ రుచులు, ఫాస్ఫేట్ ఎక్కువగా ఉంటాయి. ఇవి క్రమంగా కిడ్నీలను దెబ్బతీస్తాయి. అందువల్ల ఫ్లేవర్డ్ యోగర్ట్‌లకు బదులుగా సాదా యోగర్ట్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.
అల్పాహారంలో ఏం తినడం మంచిది?
- కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉదయం అల్పాహారంలో ఎండు ఫలాలు, తాజా పండ్లు, ఫైబర్ ఎక్కువగా ఉండే ధాన్యాలు తీసుకోవచ్చు.
- కిడ్నీల ఆరోగ్యానికి మంచి అల్పాహారాలలో చిలగడదుంప ఒకటి. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.
- కేల్ ఆకులను కూడా కిడ్నీల ఆరోగ్యం కోసం తినవచ్చు. ఇవి సూపర్‌ఫుడ్స్‌గా పరిగణించబడతాయి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి.
- విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లను మీ ఆహారంలో చేర్చుకోవచ్చు. రోజును నారింజ పండుతో ప్రారంభించవచ్చు.
- కిడ్నీలకు బెర్రీలు చాలా మంచివి. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, క్రాన్‌బెర్రీలలో యాంటీ-ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండి కిడ్నీలను కాపాడతాయి.