ఆలుగడ్డలతో ఎన్నో లాభాలు.. కానీ వాటిపై అపోహలు..నిజాలు ఏమిటంటే..!
ఆలుగడ్డల్లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయన్న కారణంతో చాలామంది వాటిని ఆరోగ్యానికి హానికరమని భావించి దూరంగా ఉంటారు. పోషకాహార నిపుణులు మాత్రం ఈ అభిప్రాయం పూర్తిగా సరికాదని చెబుతున్నారు. ఆలుగడ్డల్లో కార్బోహైడ్రేట్లతో పాటు శరీరానికి అవసరమైన ఎన్నో ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి.
- Author : Latha Suma
Date : 22-12-2025 - 6:15 IST
Published By : Hashtagu Telugu Desk
. పోషకాల గని ఆలుగడ్డలు – శరీరానికి కలిగే లాభాలు
. బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఉపయుక్తమే
. వాటిని ఎలా పడితే అలా తినకూడదు..
Potatoes : మన రోజువారీ ఆహారంలో దుంప జాతి కూరగాయలకు ప్రత్యేక స్థానం ఉంది. అందులో ఆలుగడ్డలు ముఖ్యమైనవి. తక్కువ ధరకు, అన్ని కాలాల్లో సులభంగా లభించే ఈ కూరగాయతో కూరలు, పులుసులు, వేపుళ్లు మాత్రమే కాకుండా చిప్స్ వంటి స్నాక్స్ కూడా తయారు చేస్తుంటాం. ముఖ్యంగా పిల్లలు ఆలుగడ్డ చిప్స్‌ను ఎంతో ఇష్టంగా తింటారు. అయితే ఆలుగడ్డల్లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయన్న కారణంతో చాలామంది వాటిని ఆరోగ్యానికి హానికరమని భావించి దూరంగా ఉంటారు. పోషకాహార నిపుణులు మాత్రం ఈ అభిప్రాయం పూర్తిగా సరికాదని చెబుతున్నారు. ఆలుగడ్డల్లో కార్బోహైడ్రేట్లతో పాటు శరీరానికి అవసరమైన ఎన్నో ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. వాటిని నూనెలో వేయించకుండా ఉడికించి లేదా బేక్ చేసి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణుల సూచన. సరైన విధానంలో తీసుకున్నప్పుడు ఆలుగడ్డలు శరీరానికి శక్తిని అందించే మంచి ఆహారంగా మారుతాయి.
ఆలుగడ్డల్లో విటమిన్ సి, విటమిన్ బి6, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, ఫోలేట్ వంటి అనేక పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కండరాల పనితీరును మెరుగుపరచడంలో, నరాల వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా ఆలుగడ్డలు ఉపయోగపడతాయి. కార్బోహైడ్రేట్లు ఉన్నప్పటికీ, అవి రక్తంలో చక్కెర స్థాయిని ఒక్కసారిగా పెంచకుండా శరీరానికి స్థిరమైన శక్తిని అందిస్తాయని పరిశోధనలు వెల్లడించాయి. అందుకే ఎక్కువగా ఆటలు ఆడే పిల్లలు, క్రీడాకారులు తక్షణ శక్తి కోసం ఉడికించిన ఆలుగడ్డలను తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఆలుగడ్డల్లో ఉండే పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. రక్తప్రసరణను మెరుగుపరచి రక్తనాళాలు కుచించుకుపోకుండా చేస్తాయి. ఎరుపు, పసుపు, ఊదా రంగు ఆలుగడ్డల్లో యాంటీ ఆక్సిడెంట్లు మరింత ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఊదా రంగు ఆలుగడ్డల్లో బెర్రీలకు సమానమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం విశేషం. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను నశింపజేసి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి.
బరువు తగ్గాలనుకునేవారు ఆలుగడ్డలను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. ఉడికించిన ఆలుగడ్డలు తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉండటంతో పాటు శరీరానికి కావాల్సిన శక్తి కూడా లభిస్తుంది. ఇది ఆరోగ్యకరంగా బరువు తగ్గడానికి సహకరిస్తుంది. వ్యాయామం చేసిన తర్వాత కండరాల్లో గ్లైకోజన్ స్థాయిలు తగ్గిపోతాయి. ఆ స్థాయిలను తిరిగి పునరుద్ధరించుకోవడానికి ఆలుగడ్డలు మంచి ఆహారం. చెమట ద్వారా శరీరం కోల్పోయిన మినరల్స్‌ను కూడా ఇవి తిరిగి అందిస్తాయి. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. ఆలుగడ్డలను నూనెలో వేయించి, ఉప్పు–కారం ఎక్కువగా వేసి చిప్స్ రూపంలో తీసుకుంటే ఆరోగ్యానికి మేలు కాకుండా హాని కలిగే అవకాశమే ఎక్కువ. అందుకే ఆలుగడ్డల పూర్తి ప్రయోజనాలు పొందాలంటే ఉడికించిన లేదా బేక్ చేసిన రూపంలోనే తీసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.