Gym Germs: వామ్మో.. జిమ్ పరికరాలపై ప్రమాదకరమైన బ్యాక్టీరియా!
పరిశోధనా బృందం జిమ్ పరికరాల్లోనే కాకుండా అక్కడి క్యాంటీన్లలో, విశ్రాంతి గదుల్లో కూడా మన ఇళ్లలోని టాయిలెట్ సీట్ల కంటే ఎక్కువ బ్యాక్టీరియా ఉందని కనుగొంది.
- By Gopichand Published Date - 10:22 PM, Fri - 5 September 25

Gym Germs: ఫిట్‌నెస్ కోసం ప్రజలు జిమ్‌లో గంటల తరబడి చెమటోడుస్తారు. కానీ ఆ వ్యాయామ పరికరాలు వారి ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరంగా మారతాయో చాలామందికి తెలియదు. ఒక కొత్త అధ్యయనం ప్రకారం.. జిమ్ పరికరాలపై ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉంటుందని, దాని సంఖ్య రోజువారీ ఉపయోగించే ప్రదేశాల కంటే చాలా రెట్లు అధికంగా ఉందని వెల్లడైంది. అయితే అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ పరికరాలపై ఉండే క్రిములు (Gym Germs) టాయిలెట్ సీటుపై ఉండే వాటి కంటే కూడా ఎక్కువగా ఉన్నాయి.
అధ్యయనంలో వెల్లడైన నిజాలు
ఫిట్‌రేటెడ్ అనే సంస్థ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. పరిశోధనా బృందం జిమ్‌లోని 27 పరికరాలను పరీక్షించింది. ఈ పరిశీలనలో ఒక్కో పరికరంలో ప్రతి అంగుళానికి 10 లక్షలకు పైగా బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది. ఈ విషయం ప్రతి జిమ్ వెళ్లే వ్యక్తి తెలుసుకోవాల్సిన షాకింగ్ నిజం.
పరికరాలు మాత్రమే కాదు, క్యాంటీన్లు కూడా వ్యాధులకు నిలయం
పరిశోధనా బృందం జిమ్ పరికరాల్లోనే కాకుండా అక్కడి క్యాంటీన్లలో, విశ్రాంతి గదుల్లో కూడా మన ఇళ్లలోని టాయిలెట్ సీట్ల కంటే ఎక్కువ బ్యాక్టీరియా ఉందని కనుగొంది. ట్రెడ్‌మిల్‌లో అత్యధిక సంఖ్యలో బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది. ఈ పరికరాలపై టాయిలెట్ సీటుపై ఉండే దాని కంటే 362 రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా ఉన్నట్లు అధ్యయనం పేర్కొంది.
Also Read: Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువరాజ్ తండ్రి
ఏయే వ్యాధులు రావచ్చు?
పరిశోధనా బృందం హెచ్చరిస్తూ.. జిమ్‌లో సన్నబడటం లేదా ఫిట్‌గా ఉండటం మంచిదే. కానీ అంతకంటే ముఖ్యమైనది పరిశుభ్రత పాటించడం అని తెలిపింది. జిమ్‌లోని క్రిముల వల్ల అంటువ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందని, ఈ బ్యాక్టీరియా శరీరంలోకి చేరిన తర్వాత రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుందని పరిశోధకులు తెలిపారు.
ఎలా రక్షణ పొందాలి?
ఈ ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి నిపుణులు కొన్ని సూచనలు ఇచ్చారు.
- జిమ్‌కు వెళ్ళిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి. చేతులు, కాళ్ళు శుభ్రంగా కడుక్కోవాలి.
- పరికరాలను ఉపయోగించే ముందు వాటిని శానిటైజ్ చేసుకోవాలి.
- వ్యాయామం చేసేటప్పుడు మురికి చేతులతో ముఖం, ముక్కు, కళ్లను తాకడం మానుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా జిమ్‌లో ఆరోగ్యంగా ఉండవచ్చు.