Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువరాజ్ తండ్రి
2011 వన్డే ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు కూడా అందుకున్నాడు. ఆ టోర్నమెంట్‌లో యువరాజ్ ఒక శతకం, 4 అర్ధ శతకాలతో 362 పరుగులు చేయడంతో పాటు 15 వికెట్లు కూడా పడగొట్టాడు.
- By Gopichand Published Date - 10:13 PM, Fri - 5 September 25

Yograj Singh: భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి అయిన యోగరాజ్ సింగ్ (Yograj Singh) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీశాయి. ఆయన మహేంద్ర సింగ్ ధోనితో పాటు పలువురు భారత క్రికెటర్లపై తీవ్ర ఆరోపణలు చేశారు. యువరాజ్ సింగ్‌కు జట్టులో అన్యాయం జరిగిందని, ధోనితో సహా చాలామంది ఆటగాళ్లు అతడికి వెన్నుపోటు పొడిచారని ఆయన ఆరోపించారు. సచిన్ టెండూల్కర్ తప్ప యువరాజ్‌కు భారత జట్టులో మరెవరూ స్నేహితులు లేరని యోగరాజ్ అన్నారు.
“ధోని సహా అందరూ యువరాజ్ అంటే భయపడ్డారు”
యోగాజ్ సింగ్ మాట్లాడుతూ.. “నేను చెప్పినట్లు విజయం, డబ్బు, కీర్తి ఉన్న చోట స్నేహితులు ఉండరు. ఎల్లప్పుడూ వెన్నుపోటు పొడిచేవారే ఉంటారు. వారు మిమ్మల్ని కిందకు లాగాలని చూస్తారు. యువరాజ్ సింగ్ అంటే చాలా మంది భయపడ్డారు. ఎందుకంటే ఆయన దేవుడిచ్చిన గొప్ప ఆటగాడు. ఆయన తమ స్థానాలను లాగేసుకుంటాడని ధోని నుండి ప్రతి ఒక్కరూ భయపడ్డారు” అని అన్నారు.
Also Read: Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జరిగిందా?
ఇది యోగరాజ్ సింగ్ ధోనిపై విమర్శలు చేయడం ఇదే మొదటిసారి కాదు. ఆయన గతంలో కూడా చాలాసార్లు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. యువరాజ్ సింగ్‌ను ముందుగానే రిటైర్ కావాలని బలవంతం చేశారని యోగరాజ్ నమ్ముతున్నారు. అయితే యువరాజ్ భారత జట్టుకు చాలా కాలం పాటు ప్రాతినిధ్యం వహించాడు. ఆయన 2000 నుండి 2017 వరకు భారతదేశం తరపున ఆడాడు. యువరాజ్ 402 మ్యాచ్‌లలో 35.05 సగటుతో 11,178 పరుగులు చేశాడు. ఇందులో 17 శతకాలు, 71 అర్ధ శతకాలు ఉన్నాయి. 2011 వన్డే ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు కూడా అందుకున్నాడు. ఆ టోర్నమెంట్‌లో యువరాజ్ ఒక శతకం, 4 అర్ధ శతకాలతో 362 పరుగులు చేయడంతో పాటు 15 వికెట్లు కూడా పడగొట్టాడు. ఇక యోగరాజ్ సింగ్ గురించి చెప్పాలంటే.. ఆయన భారతదేశం తరపున 1 టెస్ట్ మ్యాచ్‌లో 10 పరుగులు చేసి 1 వికెట్, 6 వన్డే మ్యాచ్‌లలో 1 పరుగు చేసి 4 వికెట్లు తీసుకున్నారు.