వేసవి బరిలో..క్యూ కడుతున్న స్టార్ హీరోల సినిమాలు
- Author : Vamsi Chowdary Korata
Date : 16-02-2026 - 12:25 IST
Published By : Hashtagu Telugu Desk
TOLLYWOOD సంక్రాంతి తర్వాత కీలకమైన వేసవి సీజన్‌ను టార్గెట్ చేస్తూ టాలీవుడ్‌లో వరుస సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. మార్చిలో యశ్ నటించిన ‘టాక్సిక్’, పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి భారీ చిత్రాలు రానున్నాయి. ఏప్రిల్‌లో రామ్ చరణ్ ‘పెద్ది’, నిఖిల్ ‘స్వయంభు’, శర్వానంద్ ‘బైకర్’ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఐపీఎల్ ప్రభావం ఉన్నప్పటికీ మేకర్స్ ధైర్యంగా ముందడుగు వేస్తుండటం విశేషం.
తెలుగు సినీ పరిశ్రమలో సంక్రాంతి తర్వాత అత్యంత కీలకమైన సీజన్ సమ్మర్. స్కూల్, కాలేజీలకు సెలవులు ఉండటంతో కుటుంబాలు కలిసి థియేటర్లకు వెళ్తుంటారు. ఒకప్పుడు ఈ కాలంలో అగ్రహీరోల సినిమాలు వరుసగా విడుదలై బాక్సాఫీస్ వద్ద హోరాహోరీగా పోటీ పడేవి. అయితే గత కొన్ని సంవత్సరాలుగా పాన్ ఇండియా ప్రాజెక్టులు, విడుదల తేదీల మార్పులు, ముఖ్యంగా ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రభావం వల్ల వేసవిలో సినిమాల హడావుడి కాస్త తగ్గింది. అయినప్పటికీ ఈ ఏడాది చిన్నా, పెద్దా అనేక చిత్రాలు వేసవిని టార్గెట్ చేస్తూ సిద్ధమవుతుండటంతో సమ్మర్‌లో థియేటర్లు కళకళలాడనున్నాయి.
మార్చి మొదటి వారంలోనే కొత్త సినిమాల జోరు మొదలు కాబోతుంది. లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘సతీ లీలావతి’ మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే రోజున శివాజీ, లయ కీలక పాత్రల్లో నటించిన కుటుంబ కథా చిత్రం ‘సాంప్రదాయని సుప్పిని సుద్దపూసని’ కూడా థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. మార్చి 13న చిన్న చిత్రం ‘బ్యాండ్ మేళం’ ప్రేక్షకులను అలరించనుంది. బాలీవుడ్ హిట్‌కు సీక్వెల్‌గా రూపొందిన ‘ధురంధర్ 2’ కూడా తెలుగులో విడుదల కానుంది. రూ.1300 కోట్లకు పైగా కలెక్షన్లతో దుమ్మురేపిన ‘ధురంధర్’కి కొనసాగింపుగా వస్తోన్న ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళ భాషల్లోనూ విడుదల కానుంది. భారీ యాక్షన్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఉత్తరాదిలో ఇప్పటికే మంచి క్రేజ్ సంపాదించుకుంది. ‘కేజీఎఫ్’తో పాన్ ఇండియా హీరోగా ఎదిగిన యశ్ నటించిన ‘టాక్సిక్’ కూడా అదేరోజున విడుదలకు సిద్ధమవుతోంది. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది.
ఆ తర్వాత అసలు సిసలైన బాక్సాఫీర్ పోరు మొదలు కానుంది. గతేడాది ‘ఓజీ’తో బాక్సాఫీస్‌ని షేక్ చేసిన పవర్‌స్టార్ పవన్ నటించిన తాజా చిత్రం ‘ ఉస్తాద్ భగత్‌సింగ్ ’ మార్చి 26న విడుదల కానుంది. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. రాశీ ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం ఏప్రిల్, మే నెలలో వస్తుందని అందరూ ఊహించగా ‘ పెద్ది ’ వెనక్కి తగ్గడంతో మార్చిలోనే థియేటర్లలోకి వస్తోంది. ఏప్రిల్‌లో కూడా సినిమాల సందడి కొనసాగనుంది. శర్వానంద్ నటించిన ‘బైకర్’ ఏప్రిల్ 3న రానుంది. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రం బైక్ రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కింది. అదే రోజున సంగీత్ శోభన్ నటించిన ‘రాకాస’ కూడా విడుదలవుతోంది. ఏప్రిల్ 10న నిఖిల్ సిద్ధార్థ నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘స్వయంభు’ ప్రేక్షకుల ముందుకు రానుంది. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. అదే రోజున అడివి శేష్ ‘డెకాయిట్’ రిలీజ్ కానుంది.
ఏప్రిల్ చివరి వారంలో ప్రేక్షకులకి అసలు సిసలైన మజా అందనుంది. ఏప్రిల్ 30న రామ్ చరణ్ నటించిన పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ విడుదల కానుంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వృద్దీ సినిమాస్ నిర్మిస్తోంది. పాన్ ఇండియా రేంజులో విడుదల కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇక వేసవిలో చిరంజీవి నటించిన ఫాంటసీ చిత్రం ‘ విశ్వంభర ’, అఖిల్ ‘లెనిన్’, సాయి దుర్గాతేజ్ ‘సంబరాల యేటి గట్టు’ వంటి చిత్రాలు విడుదలయ్యే అవకాశముంది. అయితే ఈ సినిమాల తేదీలపై ఇంకా క్లారిటీ రాలేదు. మొత్తానికి, ఈ వేసవిలో బాక్సాఫీస్ వద్ద మళ్లీ సందడి కనిపించేలా ఉంది. ఇందులో మెగా హీరోల నుంచే ఎక్కువ సినిమాలు వస్తుండటం విశేషం.