Tesla : భారత్‌లో టెస్లా తొలి షోరూం ప్రారంభం..ధర, డెలివెరీ టైమ్‌లైన్ వివరాలు ఇవిగో!
ఇది భారత్‌లో టెస్లా శాస్వతంగా స్థిరపడేందుకు వేసిన తొలి అడుగుగా భావించబడుతోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఫడణవీస్ మాట్లాడుతూ..టెస్లా సరైన రాష్ట్రం, నగరాన్ని ఎంచుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీ డిజైన్, టెక్నాలజీపై ఆసక్తి ఉంది. 2015లో అమెరికా పర్యటనలో నేను తొలిసారిగా టెస్లా కారులో తిరిగాను అని సీఎం అన్నారు.
- By Latha Suma Published Date - 12:48 PM, Tue - 15 July 25

Tesla : అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లా చివరికి భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. మహారాష్ట్ర రాజధాని ముంబయిలో సంస్థ తొలి అధికారిక షోరూంను మంగళవారం బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని మ్యాక్సిటీ మాల్‌లో ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ హాజరై, టెస్లాను హర్షంగా స్వాగతించారు. ఇది భారత్‌లో టెస్లా శాస్వతంగా స్థిరపడేందుకు వేసిన తొలి అడుగుగా భావించబడుతోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఫడణవీస్ మాట్లాడుతూ..టెస్లా సరైన రాష్ట్రం, నగరాన్ని ఎంచుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీ డిజైన్, టెక్నాలజీపై ఆసక్తి ఉంది. 2015లో అమెరికా పర్యటనలో నేను తొలిసారిగా టెస్లా కారులో తిరిగాను అని సీఎం అన్నారు.
‘మోడల్ వై’ ధర, ఫీచర్లివే..
ఈ సందర్భంగా టెస్లా తమ ప్రతిష్ఠాత్మక ఎలక్ట్రిక్ SUV మోడల్ Yను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చిన ఈ కారులో తొలి బేస్ వెర్షన్ ‘ఆర్‌డబ్ల్యూడీ’ ధర రూ.61.07 లక్షలు (ఆన్‌రోడ్ ముంబయి) కాగా, లాంగ్ రేంజ్ వెర్షన్ ధర రూ.69.15 లక్షలు. భారత మార్కెట్లో అధిక దిగుమతి సుంకాలు, రవాణా ఖర్చుల కారణంగా ఈ ధరలు అంతర్జాతీయ మార్కెట్ల కంటే గణనీయంగా ఎక్కువగా ఉన్నాయి. ఉదాహరణకు, అమెరికాలో ఇదే బేస్ మోడల్ $44,990 (రూ.38.63 లక్షలు), చైనాలో రూ.31.57 లక్షలు మాత్రమే. ఈవెంటుకు ముందుగానే టెస్లా తన మోడల్ Y కారును భారత రహదారులపై పరీక్షించింది. ముంబయి-పుణే జాతీయ రహదారిపై పరీక్ష నడిపించగా, పలువురు వాహనప్రియుల దృష్టిని ఆకర్షించింది.
తాజా మోడల్‌ను ‘జునిపెర్’ అనే కోడ్‌నేమ్‌తో రూపొందించగా, ఇది గత మోడళ్ల కంటే అధునాతన ఫీచర్లతో కూడి ఉంది. ఇందులో ప్రత్యేకంగా C-షేప్ LED లైట్లు, గ్లాస్ రూఫ్, ట్విన్ స్పోక్ అలాయ్ వీల్స్ వంటి డిజైన్ ఎలిమెంట్లు ఉన్నాయి. పనితీరు పరంగా చూస్తే, మోడల్ Y ఒక సారిగా పూర్తిగా ఛార్జ్ చేసినప్పుడు 500-600 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. 0 నుంచి 96 కి.మీ. వేగాన్ని కేవలం 4.6 సెకన్లలో అందుకుంటుంది. గరిష్ఠంగా గంటకు 200 కి.మీ. వేగంతో వెళ్తుంది. కారులో 15.4 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వెనక ప్యాసింజర్ల కోసం 8 అంగుళాల డిస్‌ప్లే, అడాస్ (ADAS), వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ వంటి అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. కాగా ప్రస్తుతం ఈ కార్లు ఢిల్లీ, గురుగావ్ & ముంబై నగరాలకు అందుబాటులో ఉన్నాయి. ఈ మోడల్ కార్లను బుక్ చేసుకున్న వాళ్లకు త్వరగా డెలివరీ ఇవ్వడానికి కూడా ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. డెలివెరీలు, మరో రెండు నెలల్లో, సెప్టెంబర్ 2025 నుంచి ప్రారంభం కానున్నాయి.
ఇక, టెస్లా కార్లలో కలర్ ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి అవి:
Stealth Grey
.Pearl White Multi-Coat (రూ. 95,000)
.Diamond Black (రూ. 95,000)
.Glacier Blue (రూ. 1,25,000)
.Quicksilver (రూ. 1,85,000)
.Ultra Red (రూ. 1,85,000)
ఇప్పటికే అమెరికా, కెనడా వంటి మార్కెట్లలో విజయవంతంగా కొనసాగుతున్న టెస్లా, ఇప్పుడు భారత మార్కెట్‌లోనూ తమ పట్టు కోసం కృషి మొదలుపెట్టినట్లు కనిపిస్తోంది. అయితే, దేశీయంగా తయారీ యూనిట్ నెలకొల్పాలన్న అంశంపై సంస్థ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇదే సమయంలో, దేశవ్యాప్తంగా మరిన్ని షోరూమ్లు, సర్వీస్ సెంటర్లు ఏర్పాటు చేసే అవకాశాలపై పరిశ్రమ వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి. మొత్తానికి, భారత వినియోగదారుల కోసం టెస్లా తెరపైకి వచ్చిన తాజా అడుగు, దేశీయ ఎలక్ట్రిక్ వాహన రంగంలో పెద్ద మార్పులకు నాంది పలికే అవకాశం ఉంది.