Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్.. త్వరలో మార్కెట్‌లోకి FF C6!
కంపెనీ ఇంకా అధికారిక స్పెసిఫికేషన్లను ప్రకటించలేదు. కానీ నివేదికల ప్రకారం ఈ బైక్ సుమారు 250cc నుంచి 350cc పెట్రోల్ బైక్‌ల మాదిరిగా పెర్ఫార్మెన్స్ ఇస్తుంది.
- By Gopichand Published Date - 04:58 PM, Mon - 1 September 25

Royal Enfield: పెట్రోల్ ఇంజిన్ బైక్‌లతో పేరుగాంచిన రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) ఇప్పుడు ఎలక్ట్రిక్ విభాగంలోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. ఇటీవల కంపెనీ మొదటి ఎలక్ట్రిక్ క్రూజర్ బైక్ FF C6 చెన్నై రోడ్లపై టెస్టింగ్ సమయంలో కనిపించింది. గత సంవత్సరం EICMA షోలో ఈ బైక్‌ను మొదటిసారి ప్రదర్శించారు. కంపెనీ దీనిని 2026 మొదటి త్రైమాసికంలో లాంచ్ చేసే అవకాశం ఉంది.
‘ఫ్లయింగ్ ఫ్లీ’ లాంటి రెట్రో డిజైన్
FF C6 బైక్ డిజైన్ రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ బైక్ ‘ఫ్లయింగ్ ఫ్లీ’ (1942-45) ఆధారంగా రూపొందించబడింది. గుండ్రటి హెడ్‌ల్యాంప్, గిర్డర్ ఫోర్క్స్, రెట్రో-స్టైల్ రియర్-వ్యూ మిర్రర్స్ దీనికి పాత క్లాసిక్ లుక్‌ను ఇస్తాయి. బైక్ సింపుల్‌గా, క్లీన్‌గా కనిపించడానికి ఇందులో బాడీ ప్యానలింగ్ చాలా తక్కువగా ఉంది.
బ్యాటరీ- కూలింగ్ ప్రత్యేక సెటప్
బైక్‌లోని బ్యాటరీ కంపార్ట్‌మెంట్ ఫిన్-లాంటి నిర్మాణంతో వస్తుంది. ఇది స్టైలిష్‌గా ఉండటమే కాకుండా బ్యాటరీని చల్లగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. ఇందులో 4 నుండి 5 kWh సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్ ఉంటుందని భావిస్తున్నారు. ఇది లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీ టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. ఈ బ్యాటరీ చాలా సురక్షితమైనది. ఎక్కువ కాలం మన్నుతుంది. దీనికి అదనంగా యాక్టివ్ థర్మల్ కంట్రోల్, సెల్-లెవల్ మానిటరింగ్ వంటి అధునాతన ఫీచర్లు కూడా ఉంటాయి.
రేంజ్- పెర్ఫార్మెన్స్
కంపెనీ ఇంకా అధికారిక స్పెసిఫికేషన్లను ప్రకటించలేదు. కానీ నివేదికల ప్రకారం ఈ బైక్ సుమారు 250cc నుంచి 350cc పెట్రోల్ బైక్‌ల మాదిరిగా పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 100 నుంచి 150 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఇందులో మిడ్-మౌంటెడ్ మోటార్, బెల్ట్-డ్రైవ్ సిస్టమ్ ఉంటాయి. ఇవి రైడింగ్‌ను సున్నితంగా, శబ్దం లేకుండా చేస్తాయి.
వీల్స్, సీటింగ్, ఫీచర్లు
FF C6లో 19-అంగుళాల అల్లాయ్ వీల్స్, క్లాసిక్ ఫెండర్స్ ఉంటాయి. సీటింగ్ పొజిషన్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అవసరమైతే పిలియన్ సీట్‌ను తీసివేయవచ్చు. భద్రత కోసం ఇందులో డ్యుయల్-ఛానల్ ABS, డిస్క్ బ్రేక్‌లు స్టాండర్డ్ ఫీచర్లుగా ఉంటాయి. టెక్నాలజీ విషయానికి వస్తే ఇందులో బ్లూటూత్-సపోర్ట్ ఉన్న డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉంటుంది. ఇందులో కాల్స్, మెసేజ్‌లు, మ్యూజిక్, టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి సౌకర్యాలు లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో కీ-లెస్ సిస్టమ్, స్టార్ట్ బటన్ ఫ్యూయల్ ట్యాంక్‌లా కనిపించే యూనిట్‌పై ఉంటాయి. ఇది బైక్‌కు మరింత మోడర్న్ లుక్ ఇస్తుంది.
ఎప్పుడు లాంచ్ అవుతుంది?
రాయల్ ఎన్‌ఫీల్డ్ తన మొదటి ఎలక్ట్రిక్ క్రూజర్ FF C6ను 2026 ప్రారంభంలో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇది గనుక మార్కెట్‌లోకి వస్తే భారత ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లో ఇది ఒక గేమ్-ఛేంజర్‌గా మారవచ్చు.